Vaikunta Ekadashi Celebrations : రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకల శోభ సంతరించుకుంది. గురువారం రాత్రి నుంచే పలు వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. వైష్ణవ ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాల దర్శనార్ధం వెళ్తుంటారు. మరోవైపు కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.
భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామివారి దర్శనం కల్పించారు. స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారీగా బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.