Manoj Tiwary on Gautam Gambhir : భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ 'కపట వేషాలు వేస్తాడు (Hypocrite)' అని అన్నాడు. అతడు బోధించే వాటిని పాటించడం లేదని ఆరోపించాడు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ మనోజ్ తివారీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి.
'గౌతమ్ గంభీర్ కపట వేషాలు వేస్తాడు. అతడు చెప్పినట్టు చేయడు. కెప్టెన్ (రోహిత్), అభిషేక్ నాయర్ ఇద్దరూ ముంబయి నుంచే వచ్చారు. వారికి ముంబయి ప్లేయర్లను ముందంజలో ఉంచే అవకాశం లభించింది. కానీ, జలజ్ సక్సేనా లాంటి వాళ్ల కోసం మాట్లాడే వారు లేరు. అతడు బాగా రాణిస్తున్నాడు'అని చెప్పాడు.
తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను గంభీర్ ప్రోత్సహిస్తాడని మనోజ్ అన్నాడు. 'మోర్నీ మోర్కెల్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. అలాగే అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో గంభీర్‌తో కలిసి ఉన్నాడు. వాళ్లిద్దరితో గంభీర్ కంఫర్ట్‌గా ఉంటాడు. అతడు ఏది చెప్పినా, ఓకే అనే వారికి ప్రాధాన్యం ఉంటుంది' అని పేర్కొన్నాడు.
అది సమష్టి కృషి
2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడం పూర్తిగా గంభీర్ క్రెడిట్‌గా చెప్పడాన్ని తివారీ తప్పుబట్టాడు. తనతో సహా జాక్వెస్ కల్లిస్, మన్విందర్ బిస్లా, సునీల్ నరైన్ అద్భుతంగా రాణించడం వల్ల ఆ సీజన్ టైటిల్ గెలిచామని, ఒక్క గంభీర్ కెప్టెన్సీతోనే కప్పు రాలేదని అన్నాడు. అయితే క్రెడిట్ మొత్తాన్ని తీసుకునేందుకు వీలు కల్పించే వాతావరణం, పీఆర్ ఉండటం వల్ల గంభీర్ క్రెడిట్ తీసుకున్నాడని ఆరోపించాడు.
హర్షిత్, నితీష్ సపోర్ట్
అయితే గంభీర్‌పై మనోజ్ వ్యాఖ్యలను కేకేఆర్ ప్లేయర్లు నితీశ్ రానా, హర్షిత్ రానా ఖండించారు. మనోజ్ తివారి అభద్రతాభావంతో ఉన్నాడని అన్నారు. 'వ్యక్తిగత అభద్రతాభావంతో ఒకరిని విమర్శించడం మంచిది కాదు. గౌతీ భయ్యా తన కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. ఆటగాళ్లు కష్టపడుతున్నప్పుడు వారికి సపోర్ట్ చేస్తాడు. అన్నీ సానుకూలంగా జరిగినప్పుడు వారికి క్రెడిట్ ఇస్తాడు' అని హర్షిత్ పోస్ట్ చేశాడు.
'విమర్శలు వాస్తవాల ఆధారంగా చేయాలి. వ్యక్తిగత అభద్రతాభావాలపై కాదు. నేను కలిసిన ఆటగాళ్లలో అత్యంత నిస్వార్థంగా ఉండే వాళ్లలో గౌతీ భయ్యా ఒకరు. కష్ట సమయాల్లో మరెవరూ తీసుకోనంత బాధ్యత తీసుకుంటాడు. అతని పనితీరుకు PR అవసరం లేదు. ట్రోఫీలే అతడి గురించి చెబుతాయి' అని నితీశ్ రానా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Criticism should be based on facts not personal insecurities. Gauti bhaiyya is one of the most selfless players I’ve ever met. He shoulders responsibility in times of distress like no other. Performance doesn’t need any PR. The trophies speak for themselves.
— Nitish Rana (@NitishRana_27) January 9, 2025
మనోజ్ సవాల్
తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. దీంతో మనోజ్ తివారీ ఓ పోస్ట్ పెట్టాడు. 'గంభీర్‌పై నేను మాట్లాడిన దాని గురించి నన్ను ట్యాగ్ చేసేముందు, నా ఇంటర్వ్యూ ట్రాన్స్లేట్ చేసుకొని చూడండి. ఆ తర్వాత వచ్చి నాతో డిబేట్ చేయండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా' అని ట్వీట్ చేశాడు.
Before taggin me and sharing your opinions on what I said about Gautam Gambhir and what’s happening with the team India. Go through this interview and get it translated and then come back and have a debate with me. I’m ready to answer all the queries. https://t.co/2UkY5SvQQk
— MANOJ TIWARY (@tiwarymanoj) January 9, 2025
గంభీర్ కామెంట్స్‌కు పాంటింగ్ రిప్లై- అతడి బాధ అది కాదంట!
టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శన- ప్లేయర్లే కాదు, గంభీర్ ప్లేస్‌కు కూడా నో గ్యారెంటీ!