Missing Minor Girls In Vijayawada : ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో యువత ఎక్కువ గడుపుతున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని అందులో పంచుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న మోసగాళ్లు యువతకు ఏదో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. పెళ్లి పేరుతో, ఉద్యోగాలు, సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామంటూ మోసం చేసి డబ్బులు లాగేస్తున్నారు. ఇలా తరచూ చాలా జరుగుతున్నాయి.
సినిమా ఛాన్స్‌ల పేరుతో మోసం : తాజాగా ఏపీలోని విజయవాడలో సామాజిక మాధ్యమాల్లో యువకులను నమ్మి ఇంటి నుంచి వెళ్లిన బాలికలను పోలీసులు గంటల్లోనే కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన నలుగురు బాలికలకు సామాజిక మాధ్యమంలో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన అలకుంట వేణు పరిచయమయ్యాడు.
బాలికలు కనిపించకపోవడంతో : అలా పరిచయం పెంచుకున్న వేణు యువతులకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని బెంగుళూరు వెళ్దామని నమ్మించాడు. నిజంగానే సినిమా ఆఫర్లు ఇప్పిస్తాడనుకున్న ఆ యువతులు తల్లిదండ్రులతో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ బాలికలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి 11 గంటలకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.
సామాజిక మాధ్యమాల్లో : దీంతో సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో చివరికి బాలికల సామాజిక మాధ్యమాలను పరిశీలించారు. అందులో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువకుడిని గుర్తించి విచారించారు. అతని ద్వారా అలకుంట వేణుకు ఫోన్ చేపించారు. అతడు చెప్పడంతో వేణు, చేబ్రోలు మండలానికి చెందిన కెటావత్ యువరాజ్ నాయక్ (21), చేకూరుకు చెందిన పెద్ద వెంకటేశ్వర్లు (30) బాలికలను తీసుకొని పెదనందిపాడుకు వచ్చారు.
గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు : అక్కడ పోలీసులను చూసి యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. బాలికలను విజయవాడకు తీసుకొని వచ్చి తెల్లవారుజామున 4 గంటలకు తల్లిదండ్రులకు అప్పగించారు. వారిని బెంగుళూరుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రధాన పాత్రధారిగా వేణును గుర్తించి ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులను సీపీ ఎస్.వి రాజశేఖరబాబు అభినందించారు.
చెల్లెలి ఫోటోతో ఫేస్బుక్ డీపీ - మాయమాటలతో తెలంగాణవాసికి రూ.1.23 కోట్లు టోపీ
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్! ఆ దేశం కీలక నిర్ణయం!!