Egg Masala Pulusu in Telugu: గుడ్లతో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. ఇందులో ఎగ్ పులుసు మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. ఇంకా ప్రాంతాలను బట్టి ఈ పులుసు రుచి మారుతుంటుంది. కానీ, మీరు ఎప్పుడైనా తెలంగాణ స్టైల్ మసాలా ఎగ్ పులుసు ట్రై చేశారా? ఇది అన్నం, చపాతీ, పూరి, అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలా గుడ్డు పులుసును బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పులుసు కోసం కావాల్సిన పదార్ధాలు
- 5 ఉడకబెట్టిన గుడ్లు
- 80 మిల్లీ లీటర్ల నూనె
- అర లీటర్ నీళ్లు
- 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు
గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు
- పావు కప్పు వేరుశనగ (పల్లీలు)
- పావు కప్పు నువ్వులు
- పావు కప్పు ఎండు కొబ్బరి పొడి
- 2 టేబుల్ స్పూన్ల ధనియాలు
- 1 టీ స్పూన్ జీలకర్ర
- పావు టీ స్పూన్ మెంతులు
- 150 గ్రాముల ఉల్లిపాయ తరుగు
- 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్
- పావు టీ స్పూన్ పసుపు
- 1 టేబుల్ స్పూన్ కారం
- రుచికి సరిపడా ఉప్పు
- 200 మిల్లీలీటర్ల చింతపండు పులుసు
- అర లీటర్ నీళ్లు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి కడాయిలో వేరుశనగపప్పు, మెంతులు వేసి ఎర్రగా లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి.
- ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి ఓ నిమిషం వేయించుకుని.. అనంతరం నువ్వులు వేసి చిటపటమనిపించాలి.
- ఇక చివర్లో కొబ్బరి పొడి వేసి 30 సెకన్లు వేపి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం అదే గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. (ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే గ్రేవీకి చిక్కని రుచి వస్తుంది)
- ఇప్పుడు మిక్సీ జార్లోని మెత్తగా చేసుకున్న పొడిలో వేగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లలి పేస్ట్, కారం, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు వేసి మెత్తని వెన్నలా పేస్ట్ చేసుకోవాలి.
- మరోవైపు ఉల్లిపాయలు వేపుకున్న నూనెలోనే గుడ్లకి గాట్లు పెట్టి గరిట బోర్లించి తిప్పుతూ హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి పక్కకు తీసుకోవాలి.
- ఆ తర్వాత అదే నూనెలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలి.
- నూనె పైకి తేలాక అర లీటర్ నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.
- గ్రేవీ బాగా ఉడికాక వేయించుకున్న గుడ్లు వేసి మంట తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
- చివర్లో కొత్తిమీర తరుగు వేసి దించేసుకుంటే మసాలా గుడ్డు పులుసు రెడీ!
సూపర్ టేస్టీ 'బెండకాయ మజ్జిగ పులుసు'- ఇలా చేస్తే చుక్క మిగలకుండా జుర్రేస్తారు!
తెలంగాణ స్పెషల్ "సకినాలు, బియ్యప్పిండి మురుకులు" - ఇలా చేస్తే గుల్లగా కరకరలాడుతూ సూపర్ టేస్ట్!