How to Grow French Beans at Home in Telugu: సూపులూ, కూరలూ, పులావ్, వెజిటబుల్ బిర్యానీ ఇలా వంటకం ఏదైనా అందులో బీన్స్ చేరితే వచ్చే రుచే వేరు. అందుకే ఎక్కువ శాతం మంది కూరగాయలతో పాటు వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే మార్కెట్లో కొన్నిసార్లు బీన్స్ రేట్ ఎక్కువ ఉండటంతో వీటిని కొనడానికి వెనకాడుతుంటారు. అయితే అలాంటి పరిస్థితి రాకూడదంటే ఇంట్లోనే బీన్స్ పెంచుకోవడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. తక్కువ కాలంలో పండించగలిగే మొక్కల్లో ఇదీ ఒకటని చెబుతున్నారు. మరి ఈ మొక్కలను ఇంట్లో పెంచడం ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బీన్స్నే ఫ్రెంచ్ బీన్స్, స్ట్రింగ్ బీన్స్ అని కూడా పిలుస్తారని నిపుణులు అంటున్నారు. ఇవి తేమ కలిగిన సమశీతోష్ణ వాతావరణంలో బాగా పెరుగుతాయని చెబుతున్నారు. ఇక ఈ మొక్కల్లో ఎత్తుగా పెరిగేవి(పోల్‌బీన్స్), కింద పెరిగేవి(బుష్‌బీన్స్) అంటూ చాలా రకాలే ఉన్నాయంటున్నారు. మీ అవకాశాన్ని బట్టి ఎంచుకోవచ్చని చెబుతున్నారు. ఇంట్లో ఎలా పెంచాలంటే
- స్ట్రింగ్ బీన్స్ నాటుకునేందుకు సారవంతమైన, నీరు నిల్వ ఉండని మట్టి కావాలంటున్నారు. లేదంటే మట్టిలో కంపోస్ట్ కలిపి నాటినా మంచిదే అంటున్నారు.
- ఒకటి కంటే ఎక్కువ మొక్కల్ని పెంచితే 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు నాటుకోవాలని, సుమారు 1 నుంచి 2 అంగుళాల లోతులో విత్తనం నాటాలని చెబుతున్నారు.
- రోజూ కాకుండా వారానికి మూడు సార్లు నీటిని పెడితే చాలంటున్నారు. అలాగే మొక్కకు పూత, కాయ వచ్చినప్పుడు నైట్రోజన్ తక్కువ, పొటాషియం, ఫాస్పరస్ అధికంగా ఉండే ఎరువులు వేయాలని సూచిస్తున్నారు.
- కాయ చేతికొచ్చే సమయంలో మట్టి నాణ్యతను పెంచే ఎరువులు అందించాలని చెబుతున్నారు.
- కాత మొదలయ్యాక 15 నుంచి 20 రోజుల్లో వీటిని కోసుకోవచ్చని వివరిస్తున్నారు.
- ఇక వీటికి ఎల్లో మొజాయిక్ వైరస్, పేనుబంక వంటి చీడలు వచ్చే అవకాశం ఉందని, వీటిని అరికట్టడానికి నిత్యం మొక్కలను పరిశీలించాలంటున్నారు. అలాగే వేపనూనె, బేకింగ్ సోడా మిశ్రమం వంటివి చల్లాలని చెబుతున్నారు.
- ఈ జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల ఇంట్లోనే బీన్స్ పెంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా పంట చేతికి వస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని అంటున్నారు.
పోషకాలు ఎక్కువే: పోషకాలు పుష్కలంగా ఉండే ఆకుపచ్చని కూరగాయల్లో గ్రీన్ బీన్స్ కూడా ఒకటి. వీటిల్లో విటమిన్ ఏ, సి, కె, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హానికారకమైన ఫ్రీరాడికల్స్‌ని తగ్గిస్తాయని, రోగనిరోధకశక్తిని పెంచుతాయని అంటున్నారు.
చలి నుంచి మొక్కలనూ రక్షించాలి - ఈ టిప్స్ పాటిస్తేనే హెల్దీగా ఎదుగుతాయ్!
మీ నిమ్మచెట్టు ఎదగడం లేదా? - ఈ టిప్స్ పాటిస్తే కాయలు పుష్కలంగా కాస్తాయి!