Revanth Reddy Kodangal Meet : కొడంగల్ నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు, పనులు తీసుకువచ్చే బాధ్యత తనదని, కాని ఆ అభివృద్ధి పనుల్ని సకాలంలో పూర్తి అయ్యేలా సహకరించాల్సిన బాధ్యత కొడంగల్ ప్రజలదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) అన్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొండగల్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లారు.
దీంతో రేవంత్‌ను చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించవచ్చారు. దీంతో వారితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాసేపు మాట్లాడారు. ప్రతికష్టంలో కొడంగల్(Kodangal) ప్రజలు అండగా ఉన్నారని, ఇంత చేసిన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. అపారమైన నాపరాయి గనులు ఉన్నా, గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని, పరిశ్రమలు ఏర్పాటైతే ఆ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయన్నారు.
ఫార్మా కంపెనీలొస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. అక్కడి ప్రజలు భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. భూసేకరణలో పట్టా భూములకు, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అభివృద్ధికి సహకరించకపోతే కొడంగల్ ప్రాంతం ప్రాంతం నష్టపోతుందని గుర్తు చేశారు. కొడంగల్‌కు ఏళ్లుగా మంత్రులు లేరని ఏకంగా ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.