Aseel Chicks in Wanaparthy : తెలంగాణలో నాటుకోడి పేరు చెబితే పందెం కోళ్లతో పాటు, మసాలాతో వండిన నాటు కోడి కూర నోరూరిస్తాయి. అదే ఆంధ్రాలోనైతే సంక్రాంతికి కోడి పందాలకు నాటు కోడికి భలే గిరాకీ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా చాలా మంది పందాల కోసం నాటుకోళ్లను పెంచుతారు. వాటి కోసం లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు చేసి.. ఆ ఖర్చుకు కొన్ని రెట్ల లాభాలను చూస్తారు. ఒకరకంగా చెప్పాలంటే రకాన్ని బట్టి ఒక్కో కోడి ధర రూ.50 వేలు నుంచి రూ.1 లక్ష వరకు పలుకుతుంది. కానీ వనపర్తి జిల్లాలోని ఓ వ్యక్తి మాత్రం సరదా కోసం నాటు కోళ్లను పెంచి లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. చాలా మంది పందెం కోసం మాత్రమే నాటుకోళ్లను పెంచుతుంటారనే భావనలో ఉండిపోతారు.
రూ.లక్షలు పలికే కోళ్లు : వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెందిన గురునందన్ రెడ్డి కొన్నేళ్లుగా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆసిల్ జాతి కోళ్లను పెంచుతున్నాడు. వాటి తిండికే అతగాడికి లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ వాటిని అమ్మితే మాత్రం దానికి రెంటింపు స్థాయిలో ఆదాయం వస్తుంది. ఈయన 2006 లో మార్కెటింగ్ శాఖ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ పొందాక ఆయన వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా దృష్టి సారించారు. దీంతో రకరకాల కోళ్లను పెంచుతున్నారు. దీంట్లో చిలక ముక్కు, నెమలి తోక, పొడవాటి మెడ, బలమైన శరీర సౌష్టవం ఉన్న అసిల్ జాతి కోళ్లకు డిమాండ్ బాగా ఉందని గమనించారు. దీంతో 2007 లో లక్ష వెచ్చించి రెండు జతల పిల్లలు తీసుకువచ్చారు. అవి పెద్దగా పెరిగి మళ్లీ పిల్లలు పెట్టింది.