Rare surgery in Rainbow Hospital :నవ మాసాలు మోసి శిశువుకు తల్లి జన్మనిస్తుంది. అలాంటి తల్లి గర్భంలోని శిశువుకు హృదయ సంబంధ సమస్య ఎదురైతే, ఆ తల్లి బాధ వర్ణించలేనిది. కానీ ఆ చిన్నారి సమస్యను తొలగించి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి పాప ప్రాణాలను రక్షించారు. ఈ శస్త్ర చికిత్స కోసం ప్రపంచంలోనే తొలిసారిగా కొత్త విధానాన్ని ఆసుపత్రి వైద్యులు వినియోగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి వైద్యులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన సోనీ ప్రియ రెండోసారి గర్భం దాల్చగా, టిఫా స్కానింగ్‌లో శిశువు గుండెలోని అయోటిక్ వాల్వు (బృహద్ధమని) బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచన మేరకు ఆమె రెయిన్ బో ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, వైద్యులు అయోటిక్ వాల్వు పూర్తిగా మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే చికిత్స చేయకపోతే గర్భంలోనే శిశువు మృతి చెందే అవకాశం ఉందని సదరు గర్భిణికి తెలిపారు.
పుట్టక ముందు బృహద్ధమని కవాటం బ్లాక్ అయితే దాన్ని క్లిటికల్ అయోటిక్ స్టెనోసిస్‌గా వ్యవహరిస్తారని వైద్యులు చెప్పారు. దీని కారణంగా గుండెలోని ఎడమ జఠరిక పెద్దగా అయిపోతుందని వివరించారు. ఈ క్రమంలో గుండె పని తీరు తగ్గిపోతుందని వెల్లడించారు. వాల్వు లీకవుతుందన్నారు. ఇలాంటి సందర్భంలో చికిత్స చేయకపోతే చాలా మంది శిశువులు తల్లి గర్భంలోనే మరణిస్తారని చెప్పారు.