AP Ministers Portfolios :దేశంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారి ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యాలపై కేంద్రమంత్రులకు మోదీ దిశానిర్దేశం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి కూటమి తరపున గెలిచిన ముగ్గురికి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పించగా నేడు వారికి శాఖలను కేటాయింపులు జరిగాయి.
ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు : ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేటాయించగా, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు (సహాయమంత్రి), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ మంత్రి) శాఖలను కేటాయించారు.
కింజరాపు రామ్మోహన్‌నాయుడు :శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసినరామ్మోహన్ నాయుడు వయస్సు 36 సంసవత్సరాలు. ఆయనకు భార్య శ్రావ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు.
2014లో ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున తొలిసారి పోటీచేసి లక్షా 27 వేల ఓట్లకుపైగా మెజార్టీలో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఓటమిపాలయినా, ఆయన మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలుపుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 లక్షల 27వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.