తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం షాపుల్లో వాటా - లేదంటే ఏటా రూ. 30 లక్షలు కట్టాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్​లో మద్యం దుకాణాల్లో వాటాకు స్థానిక నేతల డిమాండ్ - కాదన్న వారికి అడ్డంకులు సృష్టిస్తున్న ఎమ్మెల్యేలు - ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్న మారని లీడర్లు

NEW LIQOUR POLICY IN ANDHRA PRADESH
LIQUOR SHOPS IN AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 3:32 PM IST

AP Liqour Shops Issue : మద్యం దుకాణాల వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరి ఎమ్మెల్యేల తీరు మారట్లేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటుచేయాలంటే వారికి 30 నుంచి 40 శాతం వాటా, లేదంటే ఏటా రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు అంగీకరించకపోతే పలు రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు షాపు నిర్వాహణకు అనువైన భవనాలను వ్యాపారులకు ఎవరూ అద్దెకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.

కొంతమంది ఎలాగోలా భవనాలు అద్దెకు తీసుకుంటే అవి నిబంధనలకు అనుగుణంగా లేవంటూ ఎక్సైజ్‌ పోలీసులను పంపిస్తున్నారు. రెగ్యులర్‌ లైసెన్సులు ప్రభుత్వం నుంచి పొందకుండా చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారులు నష్టపోతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది. బాపట్ల, గుంటూరు, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, ఏలూరు, పల్నాడు, కాకినాడ, కర్నూలు, తిరుపతి తదితర జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ పరిస్థితి ఉంది.

15 శాతం దుకాణాలకు రెగ్యులర్‌ లైసెన్సు లేదు :ఆంధ్రప్రదేశ్​రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం గత నెల(అక్టోబర్​) 14, 15 తేదీల్లో ఎక్సైజ్‌ శాఖ ప్రొవిజినల్‌ లైసెన్సులు జారీచేసింది. 16వ తేదీ నుంచి పలుచోట్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి. అవి నిబంధనలకు అనుగుణంగానే ఉంటే అప్పుడు పరిశీలించి ఎక్సైజ్‌ అధికారులు రెగ్యులర్‌ లైసెన్సు జారీచేస్తారు. సాధారణంగా ఎప్పుడైనా ప్రొవిజనల్‌ లైసెన్సులు జారీచేసిన తర్వాతి పది రోజుల్లోనే రెగ్యులర్‌ లైసెన్సుల జారీ ప్రక్రియ ముగుస్తుంది.

ఈసారి మాత్రం ఈ గడువు ఇప్పటివరకూ మూడు సార్లు పెంచినా, మద్యం దుకాణాలు ప్రారంభమై దాదాపు నెల రోజలువుతున్నా ఇంకా 489 దుకాణాలకు రెగ్యులర్​ లైసెన్స్​లు జారీ కావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డంకులు సృష్టించటమే. కాకినాడలో 58, తిరుపతిలో 53, తూర్పుగోదావరి జిల్లాలో 46, కర్నూలులో 37, చిత్తూరులో 37, శ్రీసత్యసాయిలో 34, గుంటూరు జిల్లాలో 24, పల్నాడులో 21, బాపట్లలో 20, ప్రకాశం జిల్లాలలో 20 దుకాణాలకు రెగ్యులర్‌ లైసెన్సులు లేవు.

భవనాల యజమానులకు బెదిరింపులు :ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వడానికి అంగీకరించని మద్యం వ్యాపారులకు దుకాణాల ఏర్పాటు కోసం ఎవరైనా భవనాల్ని, ప్రాంగణాల్ని అద్దెకు ఇస్తే వాటి యజమానులపై ఎమ్మెల్యేల అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో వారు వెనక్కి తగ్గుతున్నారు. అనంతపురం, తాడిపత్రి వంటి చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. వైఎస్సార్, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లోని పలుచోట్ల కూడా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు.

  • సత్తెనపల్లె నియోజకవర్గంలో 30 శాతం వాటా లేదా ఏటా రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ ముఖ్య నేత కుమారుడు, ఓ గుత్తేదారు కలిసి వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
  • బాపట్ల నియోజకవర్గంలో 30 నుంచి 35 శాతం వాటా అడుగుతున్నారు. అప్పటివరకూ దుకాణాలకు రెగ్యులర్‌ లైసెన్సు రాదని చెబుతున్నారు.
  • ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యనేత లైన్​ దాటి మరీ వ్యవహరిస్తున్నారు. తనకు 35 శాతం వాటా ఇవ్వాల్సిందేనని వ్యాపారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు అంగీకరించని వారికి దుకాణాల ఏర్పాటుకు తగిన భవనాలు దొరకకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
  • పెదకూరపాడు, ఏలూరు, చిలకలూరిపేట, కాకినాడ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.

'ముందు మా ఫార్మాలిటీస్ పూర్తి చేయండి' - లిక్కర్ వ్యాపారులకు తలనొప్పులు

మందు కిక్కు- ఒకటే దెబ్బకు రూ.142.79 కోట్ల మద్యం విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details