తెలంగాణ

telangana

ETV Bharat / state

3 నెలలు తర్వాత చిక్కిన 'పుష్ప రాణి' - ఇంతకీ ఎవరీ అంగూరీ బాయి - DHOOLPET DRUG PEDDLER ARRESTED

ఎట్టకేలకు చిక్కిన ధూల్‌పేట్‌ అంగూరి బాయి - గంజాయి సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తూ పోలీసులకు ముప్పుతిప్పలు - సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకుని తిరుగుతూ చిక్కిన అంగూరీ బాయి

DHOOLPET DRUG PEDDLER ARRESTED
Dhoolpet drug peddler Anguri Bai Arrested (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2024, 7:40 AM IST

Updated : Dec 13, 2024, 7:46 AM IST

Dhoolpet drug peddler Anguri Bai Arrested : హైదరాబాద్‌ ధూల్‌పేటలోని యతీంఖానా ప్రాంతానికి చెందిన అంగూరీబాయి ఒకప్పుడు సాధారణ గృహిణి. కుటుంబం గుడుంబా వ్యాపారం చేసినా ఆమె ఎన్నడూ చేయిపెట్టలేదు. 2015 రాష్ట్ర ప్రభుత్వం ధూల్‌పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. ఆ తర్వాత ఈ కుటుంబానికి చెందిన కొందరు డబ్బు కోసం గంజాయి విక్రేయించేవారు. ఈ క్రమంలోనే అంగూరీ బాయి ఇంటి దగ్గరే ఉంటూ గంజాయి గ్రాముల్లో అమ్మకాలు ప్రారంభించింది. ఇలా తొలిసారి 2017లో ఆబ్కారీ అధికారులకు చిక్కింది. 460 గ్రాముల గంజాయి మాత్రమే దొరకడంతో స్టేషన్‌ బెయిలు ఇచ్చి పంపించారు.

ఆ తర్వాత 2019 వరకూ ఈమెపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. అప్పటి వరకూ సాధారణ గంజాయి విక్రేతగా ఉన్న అంగూరీ బాయి, కొవిడ్‌ తర్వాత గంజాయి దందాలో అంచెలంచెలుగా ఎదిగింది. కుటుంబం మొత్తం ఈ దందాలో ఉండడంతో అంగూరీ బాయి చిన్నాచితకా విక్రయాలు మానేసి పెద్ద మొత్తంలో విక్రయించే స్థాయికి చేరింది. స్థానికంగా కొందరు అధికారులు సహకరించడం, చూసీచూడనట్లు వదిలేయడంతో నెట్‌వర్క్‌ను పెంచుకుంది. ఒక్క ఆబ్కారీ శాఖ అధికారులే ఈమెపై 25 కేసులు నమోదు చేశారు. ఇవిగాకుండా పోలీసు కేసులు ఉంటాయని, వాటిపైనా ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆరు రాష్ట్రాలకు గంజాయి సరఫరా : అంగూరీభాయి అరెస్టుతో హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలు తగ్గే అవకాశముందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారంటే ఏ స్థాయిలో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ సహా తెలంగాణలో గంజాయికి డిమాండ్‌ పెరగడాన్ని అంగూరీ బాయి బాగా సొమ్ము చేసుకుంది. వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే సిండికేట్‌లో ఒకరిగా మారింది. ఎప్పుడూ చుట్టూ నలుగురు బౌన్సర్ల తరహాలో అంగరక్షకులుగా ఉంటారు. ఈ అక్రమ వ్యాపారంతో వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఫాంహౌజ్‌లతో పాటు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడగట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆరు రాష్ట్రాలకు ఈమె గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీంతోపాటు ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో కొందరు రైతులకు పెట్టుబడి కింద డబ్బు ఇచ్చి గంజాయి సాగు చేయించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గంజాయి విక్రేతలకు అంగూరీ బాయి.. రూ.20 లక్షలతో ఓ విందు ఇచ్చినట్లు సమాచారం. ధూల్‌పేటలో గంజాయి విక్రయాల నిర్మూలనకు ఆబ్కారీ శాఖ జులై మూడో వారంలో ‘ఆపరేషన్‌ ధూల్‌పేట’ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్‌ ధూల్‌పేట ఇన్‌ఛార్జి, ఆబ్కారీ రాష్ట్ర ఎస్‌టీఎఫ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి బృందం సుమారు 143 మంది గంజాయి విక్రేతల్ని అరెస్టు చేసినా అంగూరీ భాయి మాత్రం చిక్కలేదు. సిమ్‌కార్డులు మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ తన నెట్‌వర్క్‌ను కొనసాగించింది. దాదాపు మూడు నెలలు ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు గురువారం చిక్కింది.

ఆస్తుల్ని జప్తుతోపాటు పీడీ చట్టం ప్రయోగించే అవకాశం :అంగూరీ బాయి గంజాయి సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందంటే ఆమె కుమారులైన సురేందర్‌సింగ్, రాజాసింగ్, మరదళ్లు అనీత బాయి, స్వప్నాబాయి.. అల్లుడు శుభంసింగ్, సొంత చెల్లెళు ఆర్తీ బాయి, చెల్లి కుమారుడు అంకిశ్‌సింగ్‌తో పాటు సమీప బంధువులు మొత్తం దాదాపు 15 మంది అందరూ మత్తు దందాలోనే ఉన్నాయి. వీరందరూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో ఎప్పుడూ గస్తీ ఉంటుంది. కొత్త వ్యక్తులు, పోలీసులు, ఆబ్కారీ అధికారులు వస్తే వెంటనే గుర్తించి పరారయ్యేలా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని ఎంతో మంది గంజాయి విక్రేతలకు ఈమె ప్రధాన సరఫరాదారు. ఈమె అరెస్టు నేపథ్యంలో గంజాయి విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తుల లెక్కతేల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఆస్తుల్ని జప్తు చేయడంతో పాటు ఈమెపై పీడీ చట్టం ప్రయోగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఆన్​లైన్​లో ఆర్డర్​ చేస్తే - డైరెక్టుగా డోర్​ డెలివరీ! - హైదరాబాద్​లో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్

డ్రగ్స్‌కు అలవాటు పడి విక్రేతలుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

Last Updated : Dec 13, 2024, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details