PM Modi Praises Telangana Man Green Mission: తండ్రి స్ఫూర్తితో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్న ఆయన ఆ దిశలో తిరుగులేని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వేలాది మొక్కలు నాటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆదివారం నిర్వహించిన 114వ మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ రాజశేఖర్ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అమ్మ పేరుతో ఒక మొక్క : అలాగే తెలంగాణలో 'అమ్మ పేరుతో ఒక మొక్క' కార్యక్రమ నిర్వహణ చక్కని పనితీరు కనబరుస్తోందని ప్రధాని మోదీ అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన కొట్టూరు నుర్వి రాజశేఖర్ సింగరేణి సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. రాజశేఖర్ తండ్రి పాండు దర్జీ, మేకప్ ఆర్టిస్ట్. చెట్లపై ఇష్టంతో ఆయన మొక్కలు నాటుతుండేవారు. తండ్రి స్ఫూర్తితో పదకొండో ఏట నుంచే మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నారు రాజశేఖర్.
25 వేలకు పైగా మొక్కల్ని నాటిన రాజశేఖర్ : అలా ఇప్పటి వరకు స్వయంగా 25 వేలకు పైగా మొక్కల్ని నాటి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ప్రత్యేకంగా 2020 జులై 1న ‘ప్రకృతి హరిత దీక్ష’ చేపట్టారు. అప్పటి నుంచి నుంచి రోజుకో మొక్క నాటుతూ, సెల్ఫీలు దిగుతూ ఇతరుల్లోనూ చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. ప్రముఖుల జయంతి, పండుగలు, బంధుమిత్రుల పెళ్లిళ్లు, పుట్టిన రోజులు ఇలా ప్రత్యేక రోజుల్లో మొక్కలు పంపిణీ చేస్తూ, వాటిని నాటుతూ ఇతరులనూ ప్రోత్సహిస్తున్నారు.