Petition Challenging High Court Verdict On Entry Of Children In Theaters :పిల్లలకు సినిమా థియేటర్లలో ప్రవేశంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మల్టిప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాల సంఘం అప్పీలు దాఖలు చేసింది. రాత్రి 11 గంటల తరువాత ఉదయం 11 గంటలలోపు 16ఏళ్ల వయసున్న పిల్లలను సినిమా షోలకు అనుమతించరాదంటూ జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అప్పీలుదారుల తరపున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 'గేమ్ చేంజర్' సినిమా అదనపు ప్రదర్శనలకు, టిక్కెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని అన్నారు. వీటిపై విచారణ సందర్భంగా రాత్రి 11 గంటల తరువాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. ఈ ఉత్తర్వులు ప్రస్తుతం అమల్లోకి రావడంతో మల్టీప్లెక్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. సింగిల్ జడ్జి వద్ద తాము ప్రతివాదులుగా లేమని, అన్ని పక్షాల వారితో చర్చలు జరిపి 11 గంటల తరువాత పిల్లలను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకోవాలంటూ సింగిల్ జడ్జి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని, అయితే ఉత్తర్వులు మాత్రం ప్రస్తుతం అమల్లోకి వచ్చాయని అన్నారు.