Hyderabad Students Addication to Ganja : గంజాయి వ్యసనం పాఠశాలలకు కూడా వ్యాపించింది. బడి ఈడు పిల్లలు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. చిన్న వయసులోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిలబడాలంటే నీరసం, కళ్లు మైకం కమ్ముతున్నాయంటూ లేత వయసులో వయో భారం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవి అన్నీ సర్కారు బడులను టార్గెట్‌గా చేసుకుంటూ గంజాయి ముఠాలు విద్యార్థులను బానిసలుగా చేసుకొని, వారిని మత్తు అలవాటులోకి దించుతున్నారు.
'సర్, మా బడిలో పదో తరగతి పిల్లల్లో కొందరు తరగతి గదిలో సరిగ్గా పాఠాలు వినరు. ప్రశ్నలు అడిగితే సమాధానాలు తెలీదు సార్ అంటూ కళ్లుమూసుకుని చెబుతున్నారు. సరిగా నిలబడమంటే నీరసంగా ఉందంటూ కూర్చుంటున్నారు. తరగతి పూర్తయ్యాక ముగ్గురు పిల్లలను దగ్గరికి పిలిచి అడిగితే, మత్తు సిగరెట్లు తాగుతున్నామంటూ చెప్పారు. ఆరేడు నెలల నుంచి తాగుతున్నామన్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు నిర్మానుష ప్రదేశంలో తాగేసి వెళ్తున్నామని చెప్పారు. సర్, మా స్కూల్‌కు వచ్చి పిల్లలకు ఈ అలవాటు మాన్పించండి. మీరు వచ్చేటప్పుడు వారి తల్లిదండ్రులను పిలిపిస్తాం' అంటూ షేక్‌పేట్ మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొద్దిరోజుల క్రితం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులకు రాసిన లేఖ ఇది.
ఒక్క ఈ పాఠశాలలోనే కాదు, హైదరాబాద్‌లోని మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. విద్యార్థుల్లో కొందరు పాఠశాల ఆవరణలోనే గంజాయి సిగరెట్లు తాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వెంటనే స్పందించిన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆ పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ సైతం ఇచ్చారు. వారం, వారం ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ మత్తుపట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ మత్తు : మత్తుకు బానిసలైన యువకులు విద్యార్థులకు డబ్బులు ఇచ్చి గంజాయిని తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో వారికీ గంజాయి మత్తును అలవాటు చేస్తున్నారు. ఇలాంటివి ఖైరతాబాద్, సికింద్రాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో కొన్ని సర్కారు బడుల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొందరు ఉపాధ్యాయులు ఇలాంటి వారిని శిక్షిస్తుండగా, మరికొందరు వారి తల్లిదండ్రులకు చెప్పి గంజాయి అలవాటు మానేంత వరకు బడికి రావద్దని హెచ్చరించి పంపించేస్తున్నారు.
గంజాయి దొరికే ప్రాంతాలు : ప్రభుత్వ పాఠశాలల్లో మత్తు పదార్థాల వినియోగంపై ఆప్స స్వచ్ఛంద సేవా సంస్థ 2024లో సర్వే చేసింది. ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో 1000 మంది విద్యార్థులతో మాట్లాడింది. 80 శాతం మంది విద్యార్థులు పెద్దవాళ్లు అలవాటు చేయడంతోనే గంజాయి సిగరెట్లకు అలవాటు పడ్డామని చెప్పారు. గంజాయి లభించే ప్రాంతాలను కూడా వారు చెప్పారు. లాలాపేట వంతెనల కింద, సీతాఫల్‌మండి వంతెన, సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్, మలక్ పేట, ఫతేనగర్ వంతెన కింద, చాంద్రాయణగుట్ట, నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో గంజాయి లభిస్తుందని తెలిపారు. ఆదిలోనే గంజాయి మత్తు నుంచి తుంచకపోతే వారి జీవితాలు నాశనం అవుతాయని సూచించారు.
VIRAL VIDEO : గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీస్ - బైక్‌తో ఢీకొట్టి పరారైన దుండగులు
ఇన్‌స్పెక్టర్‌కు రూ.లక్షన్నర.. ఎస్‌ఐలకు రూ.50 వేలు - గంజాయి డాన్ కేసులో బయటకొస్తున్న నిజాలు