Software Engineer Dairy Farm Success Story : విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఎవరు వదులుకుంటారు. ఎందుకంటే రూ.లక్షల్లో జీతం వస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు. కానీ దిల్లీ సరిహద్దులోని గాజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి డెయిరీ ఫామ్ పెట్టారు. పాడి పరిశ్రమపై ఆసక్తితో దేశీయ ఆవుల డైరీ ఫామ్‌ను నెలకొల్పారు. ఏకంగా 1000కి పైగా దేశీయ ఆవుల ఫామ్‌ను నడపుతూ ఏటా రూ.కోట్లలో సంపాదిస్తున్నారు.
ఉద్యోగాన్ని వదిలేసి పాడి రంగం వైపు
గాజియాబాద్‌లోని సికందర్పుర్కు చెందిన అసీమ్ రావత్ యూరప్, అమెరికాలో కొన్నాళ్లు పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగం మానేశారు. 'హేతా' పేరుతో దేశీయ ఆవుల పెంపకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇదే వ్యాపారం టర్నోవర్ రూ.6కోట్లు- రూ.8కోట్లు. అసీమ్ రావత్ కేవలం పాడి పరిశ్రమకే పరిమితం కాకుండా సేంద్రీయ వ్యవసాయం, 131 రకాల సహజ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు.

110 మందికి ఉపాధి
అసీమ్ రావత్ తన ఫామ్‌లో 110 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పాడిపరిశ్రమలో ఆయన చేసిన కృషిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో 'గోపాల్ రత్న అవార్డు'తో సత్కరించింది. అలాగే 'స్టార్టప్ ఆఫ్ ది ఇయర్'తో సహా డజన్ల కొద్దీ అవార్డులను అసీమ్ దక్కించుకున్నారు.
మొదట్లో ఇబ్బందులు- ఇప్పుడు లాభాలు
"నా బాల్యం మధ్యతరగతి కుటుంబంలో గడిచింది. అయినప్పటికీ ఇంజినీరింగ్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విదేశాల్లో 14 ఏళ్లు పనిచేశా. కానీ నా మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. ఓ రోజు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో దేశీయ ఆవులతో పాల వ్యాపారం సాధ్యం కాదని విన్నాను. అప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవు అంటే లక్ష్మీ అని, సంపదకు మూలం అని వింటూనే ఉన్నాం. అప్పుడే దేశీయ ఆవులతో పాల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాను. అలా నా ప్రయాణం మొదలైంది." అని అసీమ్ రావత్ తెలిపారు.

కుటుంబంలో ఆందోళన
దేశీయ ఆవులతో పాల వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పినప్పుడు తన కుటుంబం ఆందోళన చెందిందని అసీమ్ రావత్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన కుటుంబం అంగీకరించిందని అన్నారు. తొలుత డెయిరీని కేవలం రెండు ఆవులతో ప్రారంభించానని చెప్పారు. ప్రారంభంలో సమాజం నుంచి విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు, గోశాల నిర్వహణలో చిక్కులు వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత వ్యాపారంలో లాభాలబాట పట్టానని పేర్కొన్నారు.

అసీమ్ రావత్ ఫామ్‌లో కేవలం గిర్, సాహివాల్, థార్పార్కర్, హిమాలయన్ బద్రి వంటి దేశీ జాతీ ఆవులే ఉంటాయి. జెర్సీ, బ్రౌన్ స్విస్ వంటి విదేశీ జాతి ఆవులు భారతదేశ వాతావరణానికి తగినవి కావని అసీమ్ అభిప్రాయం. "విదేశీ జాతి ఆవు పాలలో ఏ1 ప్రోటీన్ ఉంటుంది. కొద్దిగా ఏ2 రకం ప్రోటీన్ కూడా ఉంటుంది. ఏ1 ప్రోటీన్ అనేక వ్యాధులకు కారణమవుతుంది. దేశీయ జాతి ఆవుల పాలలో ఏ2 రకం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది." అని అసీమ్ రావత్ చెప్పారు.
సగం పాలు దూడలకే
అసీమ్ రావత్ తన గోశాలలోని దూడలను బాగా చూసుకుంటానని తెలిపారు. "తల్లి పాలలో సగం దూడకు వదిలేస్తాను. మిగతా సగం పాలను తీస్తాను. దీంతో దూడలు ఎక్కువగా పాలు తాగి ఆరోగ్యంగా ఉంటాయి. రావత్ తన ఫామ్‌లో నుంచి వచ్చిన ఆవు పేడ, మూత్రంతో సేంద్రియ ఎరువులు, ఔషధాలను తయారు చేస్తున్నాను. దీన్ని రైతులకు విక్రయిస్తున్నాఅను." అని చెప్పారు.

పాలు లీటరు రూ.180
అసీమ్ రావత్ ఫామ్‌లో పాలు ధర కాస్త ఎక్కువే!. అతని డెయిరీలో లీటరు పాలు రూ.180. అలాగే లీటరు నెయ్యి రూ.4000. ఫామ్‌లోని ఆవులకు క్యారెట్లు, బీట్ రూట్, జొన్నలు, మిల్లెట్స్ వంటి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. హైడ్రోపోనిక్ టెక్నాలజీని ఉపయోగించి మొలకెత్తిన మేతను కూడా గోమాతలకు వేస్తారు. ఆవులకు రసాయనాలు ఉపయోగించి తయారుచేసే ఏ దాణాను అందించనని అసీమ్ రావత్ తెలిపారు. దీని కారణంగా వారి డెయిరీలోని పాలు అధిక నాణ్యతతో ఉంటాయని, అందుకే లీటరు పాలు రూ.180కి అమ్మినా వినియోగదారులు కొంటుంటారన్నారు.
మోదీని కలిసిన రావత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం లభించడం తనకు అత్యంత గర్వకారణమైన క్షణమని అసీమ్ రావత్ తెలిపారు. మోదీని మథురలో జరిగిన ఓ కార్యక్రమంలో కలిశానని చెప్పారు. "మధుర సాహివాల్ జాతి ఆవును కూడా తీసుకెళ్లాను. అక్కడ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నా ఆవుతో ఫొటోలు దిగారు. నేటికీ వెటర్నరీ మొబైల్ వ్యాన్‌పై నా ఆవుతో కలిసి మోదీ దిగిన ఫొటో ఉంది. పాడి పరిశ్రమపై పూర్తిగా ఆసక్తి ఉంటేనే ఈ రంగంలోకి రావాలి." అని అసీమ్ రావత్ తెలిపారు.