Nursing Student Suspicious Death In Bhadradri : భద్రాచలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన పారామెడికల్ విద్యార్థిని కారుణ్య కేసులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. కళాశాల ఛైర్మన్‌పై దాడి యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. కారుణ్య ఎలా చనిపోయిందో వెంటనే తేల్చాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె మృతికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కళాశాల వద్దకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడారు. ఆయణ్ను చూసిన ఆందోళనకారులు నిందితుల తరఫున వచ్చారా? అని ఎమ్మెల్యేను నిలదీశారు. న కారుణ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, కారుణ్య బంధువులకు సర్దిచెప్పేందుకు ఎమ్మెల్యే యత్నించారు. అయినా వారు వినకపోవడంతో అక్కణ్నుంచి ఆయన వెనుదిరిగారు.
అసలేం జరిగిందంటే?
Students Protest At Bhadrachalam Para Medical College : భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల విద్యార్థి కారుణ్య అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదం నింపింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు హాస్టల్ ప్రాంగణంలో రక్తపు మడుగులో పడి ఉన్న కారుణ్యను తోటి విద్యార్థులు భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె చదువుతున్న కళాశాలలో సుమారు 10 సీసీ కెమెరాలుండగా అందులో కొన్ని పనిచేయడం లేదు. ఆ సమయంలో ఆమె ఎటువైపు వెళ్లింది? ఎలా గాయాలు అయ్యాయి ? అనే విషయాలు రహస్యంగా మారాయి. పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.