తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త ఏడాదికి ఘనం స్వాగతం పలికిన రాష్ట్ర ప్రజలు - తగ్గేదేలే అన్నట్లు సాగిన సెలబ్రేషన్స్​ - NEW YEAR CELEBRATIONS IN TELANGANA

వైభవంగా సాగిన నూతన సంవత్సర వేడుకలు - రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నేతలు - కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలతో జీవితాన్ని ముందుకు సాగించాలని సూచన

Political Leaders New Year Wishes
Political Leaders New Year Wishes 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 7:43 AM IST

New Year Celebrations 2025: నూతన సంవత్సరం సందర్భంగా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలతో జీవితాలను ముందుకు సాగించాలని సూచించారు. మరోపక్క పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి చేశారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు :రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్‌, మండలి ఛైర్మన్‌లతో సహా పలువురు మంత్రులు ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతితో ఈ నెల మూడో తేదీ వరకు సంతాప దినాలు పాటిస్తున్నందున పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగాకానీ నూతన సంవత్సర వేడుకలు ఆడంబరంగా జరుపుకోకూడదని అటు పార్టీ, ఇటు ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో పార్టీకి చెందిన ముఖ్యులంతా కూడా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2024 తన జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. పీసీసీ పదవి చేపట్టడం జీవితంలో అత్యంత గొప్ప సంఘటనగా అభివర్ణించారు. విలువలతో కూడిన జీవిత లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

దేశ ప్రజలందరికీ న్యూయర్ శుభాకాంక్షలు : దేశ ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలం అనంతమైనదని అలాంటి కాలాన్ని మన వెసులుబాటు కోసం లెక్కించే క్రమం ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుందని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ:శాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.

కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి : కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులు కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని అన్నారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనభ్యుడు హరీశ్ రావు ఆక్షేపించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందన్నారు.

నూతన సంవత్సర వేడుకలు :హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 2024కు వీడ్కోలు పలికి 2025కు ఆనందోత్సహాలతో ఆహ్వానం పలికారు. కౌంట్​డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా వెలుగులతో అబిడ్స్ ప్రాంతాలు మెరిసిపోయాయి. బేగంపేట్‌లోని పోలీస్ హాకీగ్రౌండ్స్‌లో కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియా బిగెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 వేడుక కోలాహలంగా సాగింది.

కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం : చిన్నా పెద్దా అందరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్ని డీజే సౌండ్స్‌కు లయబద్దంగా నృత్యం తేసి అబ్బురపరిచారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలు కోలాహాలంగా మారాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాలకు ప్రజలు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నగర నలుమూలల నుంచి చేరుకున్న యువత నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

గ్రాండ్​ వెల్​కమ్​ 2025 - కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం - హ్యాపీ న్యూఇయర్

కొత్త ఏడాది 2025కి పోటీ పరీక్షల ప్రణాళిక - జాబ్‌ క్యాలెండర్​తో ప్రిపేర్​ అవ్వండిలా !

ABOUT THE AUTHOR

...view details