Real Estate in Hyderabad : నచ్చిన హీరో, క్రికెటర్ ప్రచారకర్త అని, స్థలం కొంటే వెండి కాయిన్ ఇస్తామని, లక్కీ డ్రాలో విజేతలకు విహార యాత్ర, ప్రతి గజం మీద రూ.500 డిస్కౌంట్ ఇలాంటి ప్రకటనలు చూసి ప్రీలాంచ్‌లో స్థలాలు కొంటున్నారా? అయితే మీరు మోసపోవడానికి దగ్గరగా ఉన్నట్టే. ఎందుకంటే నగరంలో తాజాగా బయట పడుతున్న ప్రీలాంచ్ మోసాలే ఇందుకు ఉదాహరణ.
నగరానికి చెందిన ఆర్‌జీ వెంబర్స్, మెసర్స్ ఆర్ హోమ్స్ ఇన్‌ఫ్రా ప్రీలాంచ్ పేరుతో దాదాపు రూ.200 కోట్ల వరకు టోకరా వేశాయి. ఘట్‌కేసర్, కర్తనూర్, సంగారెడ్డి, పటాన్‌చెరువు తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, ఫాంల్యాండ్స్ తక్కువ ధరకు విక్రయిస్తామని ఆశ చూపడంతో దాదాపు 650 మంది వారికి భారీగా డబ్బులు చెల్లించారు. రెండు, మూడేళ్లు దాటినా స్థలాలు అప్పగించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పుట్టగొడుగుల్లా స్థిరాస్తి సంస్థలు :నగరంతో పాటు శివార్లలో స్థిరాస్తి వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా ఎక్కడపడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి. పలు సంస్థలు జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రీలాంచ్ పేరుతో పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి అపార్ట్‌మెంట్, లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ లేదంటే మున్సిపాలిటీల నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాలి. లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్ పక్కాగా తీసుకున్న తర్వాతే వాటిని విక్రయించాలి. కానీ కొన్ని సంస్థలు అనుమతులు తీసుకోకుండానే ప్రీలాంచ్ పేరుతో విక్రయిస్తున్నారు.