ACB Arrests AEE Nikesh Kumar : అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌కుమార్‌ను ఏసీబీ శనివారం అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, నిఖేశ్ కుమార్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు.
అసలేం జరిగిందంటే?: రంగారెడ్డి జిల్లా నీరు పారుదల శాఖ ఏఈఈ(AEE)గా పని చేస్తున్న నిఖేష్ కుమార్‌కు కళ్లు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసు విచారణలో భాగంగా శనివారం 20 బృందాలతో తనిఖీలు చేయగా, అక్రమాస్తుల గుట్టు రట్టైంది. గండిపేట మండలం పీరంచెరువు పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నిఖేష్ కుమార్ ఇంట్లో ఆయన సమక్షంలోనే అధికారులు సోదాలు చేశారు. అతడి బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ సంపాదన రూ.100 కోట్లు పైమాటే : నిందితుడికి సంబంధించిన 6 ప్లాట్లు, ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, 2 వాణిజ్య సముదాయ భవనాలను గుర్తించారు. ప్రభుత్వం విలువ ప్రకారమే వాటి విలువ రూ.17.73 కోట్లు అని తేల్చారు. బహిరంగ మార్కెట్ విలువలో దాదాపు రూ.170 కోట్లు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గండిపేట ఏఈఈగా పని చేస్తూ ఈ ఏడాది మే 30న ఒకరి నుంచి లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కి నిఖేశ్ కుమార్ కటకటాలపాలయ్యాడు. అనంతరం బెయిల్‌పై బయటకి వచ్చారు. ఆ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆస్తులు వివరాలు ఆరా తీయడంతో నిఖేశ్ అక్రమాస్తుల డొంక కదలింది. రంగారెడ్డి జిల్లాలోని నిర్మాణాలు చెరువులు, నాళాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉండటంతో నిఖేశ్ కుమార్ చక్రం తిప్పాడు. నీటి పారుదల శాఖలో ఎన్ఓసీ పత్రాలు కీలకంగా మారడంతో అతని అక్రమ ఆశకు అంతులేకుండా పోయింది.
హైదరాబాద్ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి చెందిన నిర్మాణాలకు అనుమతిచ్చి జేబులు నింపుకోవడంలో నిఖేశ్ కుమార్ నేర్పరి. ఈ ఏడాది మేలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈఈ బన్సీలాల్, ఏఈఈ కార్తీక్‌లతో నిఖేశ్ కుమార్ పాలు పంచుకున్నాడన్న ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో డీఈఈ పని చేసిన పవన్ కుమార్, రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పంట పొలాల్ని వ్యవసాయేతర భూములుగా మార్చడంలో నిఖేశ్ కుమార్ ఆరి తేరినట్లు తెలుస్తోంది.
ఒక ఏఈఈ అతి తక్కువ కాలంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టడంపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో అతడిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకుండా కాపాడిందెవరు? అక్రమార్జనతోనే ఆస్తులు కూడబెట్టాడా? లేక మరెవరికైనా బినామీగా ఉన్నాడా? అనే అంశాలలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ముగిసి నిఖేశ్‌కుమార్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు.
ఇదెక్కడి విచిత్రం - ఒక్క రూపాయి జీతం తీసుకోలే - ఆస్తి మాత్రం రూ.4.19 కోట్లు