IAS officer Burra Venkatesham : టీజీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. సంబంధిత దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సంతకం చేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డికి 62 ఏళ్ల వయసు నిండటంతో డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి ఛైర్మన్‌గా ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేశాన్ని ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డిని 2024 జనవరి 26న టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించారు.
ప్రస్తుత టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పలు రకాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. దాంతో పాటు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలను విడుదల చేశారు. న్యాయ వివాదాలను అధిగమించి వివిధ పెండింగ్‌లో ఉన్న తుది నియామకాలను చేపట్టారు. ఎక్కడా పరీక్షలకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించారు. గతంలో పరీక్ష పేపర్లు లీక్ అయిన విషయం తెలిసిందే.. అలాంటివి జరకుండా అన్ని పరీక్షలు సజావుగా నిర్వహించారు.
ప్రస్తుతం మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో తదుపరి చైర్మన్ పదవికోసం ప్రభుత్వం ఇటీవలె అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే తెలంగాణ వ్యక్తి, అనుభవమున్న సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను ఈ భాద్యతను తీసుకోవాలని ప్రభుత్వం కోరగా ఆయన అంగీకరించారు. పదవీ బాధ్యతలు తీసుకునే ముందే ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేయాలి.
ఐదున్నరేళ్లపాటు పదవిలో ఉండే అవకాశం : టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబరు 2న సాయంత్రం లేదా 3వ తేదీన బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఐఏఎస్‌గా అధికారిగా ఆయనకు ప్రస్తుతం మూడున్నరేళ్లు పదవీ కాలం ఉంది. టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులైనందున 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. దీన్నిబట్టి ఆయనకు ఐదున్నరేళ్ల పాటు టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా వ్యవహరించేందుకు అవకాశం ఉంది.
పేద కుటుంబం నుంచి ప్రస్థానం : జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నిరుపేద కుటుంబం నుంచి ఇంత స్థాయికి ఎదగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తొలి గురుకుల పాఠశాల సర్వేల్‌లో చదువుకున్నారు. 1989లో హైదరాబాద్‌లోని అంబేడ్కర్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. అనంతరం 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1995లో ఐఏఎస్‌కు ఎంపికై ఏపీ క్యాడర్‌కు వచ్చారు. 2005 నుంచి 2008 వరకు మెదక్ కలెక్టర్‌గా పనిచేశారు. అమెరికాకు చెందిన సోషల్ అకౌంటబులిటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నుంచి సోషల్ అకౌంటబులిటీ-8000 ధ్రువపత్రాన్ని బుర్రా వెంకటేశం పొందారు.
దాని తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు అందించారు. ఏపీ పునర్విభజన కమిటీలో(ముగ్గురు ఐఏఎస్‌లతో) సభ్యుడిగా ఉన్నారు విద్యార్థులకు పరీక్షలపై నమ్మకం కలిగించడమే తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు. టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుందన్న భరోసా విద్యార్థుల్లో తీసుకువస్తానని హామీఇచ్చారు.
టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - నియామక ఫైల్‌పై గవర్నర్ సంతకం
ఒకే రోజు గ్రూప్-2, ఆర్ఆర్బీ జేఈ పరీక్షలు - ఆందోళనలో అభ్యర్థులు