తెలంగాణ

telangana

ETV Bharat / state

డిజైన్లలో సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు పాటించారా? - సీడీవోపై ఎన్​డీఎస్​ఏ కమిటీ ప్రశ్నల వర్షం - ndsa committee meetings in hyd

NDSA Committee in Telangana : ఓ వైపు ఇంజినీర్లు మరోవైపు గుత్తేదార్ల ప్రతినిధులకు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్, అందులోని సందేహాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ విడివిడిగా సమావేశాలు జరుపుతోంది. ఆనకట్టల నిర్వహణ ప్రత్యేకించి 2019 పరిణామాల తర్వాత తీసుకున్న చర్యలు, చేసిన తనిఖీల పై కమిటీ ప్రత్యేకంగా సృష్టి సారించింది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులతో ఇవాళ సమావేశం కానున్న కమిటీ ఆనకట్టల వర్కింగ్ మోడల్స్​ను పరిశీలించనుంది.

NDSA Committee Inquiry On Kaleshwaram Project Damage
NDSA Committee in Telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 8:23 AM IST

Updated : Mar 22, 2024, 9:46 AM IST

NDSA Committee in Telangana : జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ రెండో రోజు సుమారు 12 గంటల పాటు జలసౌధలో ఇంజినీర్లు, గుత్తేదార్ల ప్రతినిధులతో కమిటీ సమావేశమైంది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో మొదటి రోజు సమావేశమైన కమిటీ, రెండో రోజు వారితో కూడా భేటీ అయింది. మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్ గురించి వారిని పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అన్నారం, సుందిళ్ల డిజైన్స్‌ను తామే రూపొందించామని మేడిగడ్డ డిజైన్‌ మాత్రం ఎల్​ ఆండ్​ టీ సంస్థ రూపొందిస్తే ఐఎస్​ కోడ్ నిబంధనల ప్రకారం ఆమోదించామని సీడీవో ఇంజినీర్లు కమిటీకి వివరించినట్లు సమాచారం.

డిజైన్లు ఎవరు తయారు చేశారు? ఎవరు ఆమోదించారు? ఎవరి కారణంగా అయినా మార్పులు చేయాల్సి వచ్చిందా? మార్పులు చేస్తే ఎవరి అనుమతి తీసుకున్నారు? తదితర ప్రశ్నలను కమిటీ ఇంజినీర్లను అడిగింది. సీకెంట్ ఫైల్స్‌కు సంబంధించి కూడా పూర్తి వివరాలు తీసుకుంది. మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించిన ప్రశ్నావళి ఇచ్చి వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ స్పష్టం చేసింది. మూడు ఆనకట్టల నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి కూడా కమిటీ వివరాలు తీసుకుంది.

NDSA Committee Inquiry On Kaleshwaram Project Damage : నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్స్ నిర్దేశిత విధానంలో చేశారా లేదా అని అడిగింది.మేడిగడ్డ విషయంలో షీట్ ఫైల్స్, సీకెంట్ ఫైల్స్ మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. రాఫ్ట్ ఫౌండేషన్ గురించి కూడా ఆరా తీసింది. ముందు అనుకున్న సమయం కన్నా తక్కువ వ్యవధిలోనే మేడిగడ్డ ఆనకట్ట పూర్తి చేసిన తరుణంలో నాణ్యతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని, క్వాలిటీ కంట్రోల్ నివేదికలు ఎవరికి ఇచ్చారని కమిటీ అడిగింది. ఎక్కడైనా నాణ్యతా లోపాలు ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్లారు? వాటిని ఎలా సరి చేశారు? దానిపై తీసుకున్న చర్యలు ఏమిటని అడిగింది.

ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రెండో దఫా పర్యటన - జలసౌధలో ఇంజినీర్లతో సమావేశం

ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజినీర్లతో సమావేశమైన కమిటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన నిర్వహణ చర్యల గురించి తెలుసుకుని, అందులో భాగంగా చేసిన తనిఖీలు వాటి వివరాలను కూడా అడిగి తెలుసుకుంది. 2019లో ఆనకట్టల వెనుక భాగంలో ఉన్న సీసీ బ్లాక్ దెబ్బతినడం సహా ఇతర పరిణామాల అనంతరం తీసుకున్న చర్యలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఆ తరువాత నిర్వహణ చర్యలు ఏ మేరకు చేపట్టారు, ఎన్నిసార్లు తనిఖీ చేశారు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు పూర్తిగా ఇవ్వాలని కమిటీ కోరింది.

నాణ్యత పరంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? :మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మించిన గుత్తేదారుల ప్రతినిధులతోనూ కమిటీ సమావేశమైంది. మేడిగడ్డకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, ఫౌండేషన్ గురించి కమిటీ ఎక్కువగా ఆరా తీసింది. నిర్మాణ పనులు ప్రారంభించే ముందు ఎటువంటి పరీక్షలు చేశారు, ఫౌండేషన్ ఎంత స్థాయిలో తీసుకున్నారు, తదితర ప్రశ్నలు అడిగారు. వీటితోపాటు నిర్మాణ పర్యవేక్షణ, మార్పులు- చేర్పులు, అనుమతులు నాణ్యతాపరంగా తీసుకున్న జాగ్రత్తల గురించి గుత్తేదారుల నుంచి కమిటీ వివరాలు తీసుకుంది.

నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే ఇంజినీర్ల పర్యవేక్షణలో తాము ఆనకట్ట నిర్మించినట్లు కమిటీకి గుత్తేదార్లు వివరించినట్లు తెలిసింది. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీసభ్యులతో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఇప్పటివరకు వచ్చిన వివరాలు, తదుపరి కార్యాచరణపై వారితో చర్చించనున్నారు. మూడు ఆనకట్టల నిర్మాణం కోసం రూపొందించిన నమూనాలను కమిటీ ఇవాళ పరిశీలించనుంది. మూడు రోజుల పర్యటన ముగించుకొని కమిటీ సాయంత్రం దిల్లీ వెళ్లనుంది.

బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? - అధికారులపై ఎన్​డీఎస్​ఏ కమిటీ ప్రశ్నల వర్షం

దాటవేత ధోరణి సరికాదు - ఇంజినీర్లపై ఎన్డీఎస్‌ఏ బృందం సీరియస్ - ndsa Committee on barrage designs

Last Updated : Mar 22, 2024, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details