Teacher Teaching Innovative Way in Nalgonda :ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే, పాఠశాలకి వచ్చి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటమే కాదు. పాఠశాలలను బలోపేతం చేయడం కూడా మన బాధ్యతని బలంగా నమ్మే ఉపాధ్యాయుడు ఈయన. విద్యార్థుల హాజరు పెంచితే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని భావించాడు. చదువు గొప్పతనాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాడు.
దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఈ ఉపాధ్యాయుడి పేరు గురిజ మహేశ్. స్వగ్రామం నల్గొండ జిల్లా చండూరు. సాధారణ కుటుంబంలో పుట్టి చదువు కోవడానకి చాలా కష్టాలు పడ్డాడు. పదో తరగతి వరకు సొంతూర్లోనే చదువుకున్నాడు. ఆ తర్వాత చదువుల్లో ప్రతిభ చూపి బీఈడీ పూర్తి చేశాడు. 2009 మే నెలలో డీఎస్సీ రాసి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
బడికి రాని పిల్లలను ఇంటికెళ్లి తీసుకుని వస్తున్న టీచర్ :2010లో కనగల్ మండలం రెగట్టే ప్రాథమిక పాఠశాలలో మహేశ్‌కు మొదటి పోస్టింగ్ వచ్చింది. తర్వాత చెరుకుపల్లి, చామలపల్లి, జాన్ తండా, నెవిళ్లగూడెంలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. 13 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా అంకితభావంతో పనిచేయడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మహేశ్ పని చేస్తున్నాడు.
చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలు, తన విద్యార్థులకు రావొద్దని లక్ష్యం పెట్టుకున్నారు మహేశ్. రోజు పాఠశాలకు 10 నిమిషాలు ముందే వస్తారు ఈ మాస్టర్. ఏయే తరగతుల విద్యార్థులు రాలేదో గుర్తించి, మొదట క్లాస్ లీడర్లను పిలిచి వివరాలు తీసుకుంటారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి చదువు ప్రాముఖ్యత వివరించి నచ్చజెప్పి, బైక్ మీద పాఠశాలకు తీసుకొస్తుంటారు.
"ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల్లో తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, వాళ్లు వ్యవసాయ పనుల మీద పొలాలకు వెళ్లటం, పిల్లలు చిన్న చిన్న కారణాలు చెప్తే వారిని ఇంటి దగ్గర ఉంచటం చేస్తుంటారు. ఇలాంటివి అవైడ్ చేసేలా పెద్దలకు విద్య ప్రయోజనాలు వివరిస్తూ, పిల్లలను బడిబాట పట్టేలా నావంతు నేను ప్రయత్నం చేస్తున్నాను."-గురిజ మహేశ్, ఉపాధ్యాయుడు