Minister Sridhar Babu On Musi River Clean up :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ముందుకు రావడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దేశ రాయబారి రువెన్ అజర్‌కు శ్రీధర్ బాబు కృతజ్ణతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఎంతో ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణాకు సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటునందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు.
200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ అత్యాధునిక శిక్షణలో మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికలో తమకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. ఇజ్రాయెల్ దేశం ఏ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చినా స్కిల్ కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అధునూతన పరిజ్ణానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే ఇక్కడి నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని మంత్రి సూచించారు. రక్షణ రంగం, ఏరో స్పేస్‌లో స్టార్టప్ సంస్థలకు టెక్నాలజీ సమకూర్చి ముందుకు నడపాలని శ్రీధర్ బాబు కోరారు. మౌలిక వసతుల నిర్మాణంలో రెండు దేశాలు సహకరించుకోవాలన్న ఇజ్రాయెల్ రాయబారి ప్రపోజల్‌కు ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబులు తమ దేశాన్ని సందర్శించాలని రాయబారి రువెన్ ఆహ్వానం పలికారు.