Minister Seethakka visit Mahabubabad : ప్రణాళిక ప్రకారం ఇళ్ల నిర్మాణాలను చేపట్టకపోవడంతోనే ఈ జల ప్రళయం సంభవించిందని, నిరాశ్రయులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె, నీట మునిగిన పలు కాలనీలను సందర్శించి దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. బాధితులను ఓదార్చి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు యథేచ్ఛగా ఆక్రమించిన భూ కబ్జాదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
చెరువుల కబ్జాలపై చర్యలు : మహబూబాబాద్ పట్టణంలో చెరువులను కబ్జా చేసి ఇష్టారీతిన నిర్మాణాలను చేయడంతో పట్టణం జలమయమయ్యిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైడ్రా మాదిరి చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం వరదలకు మరో కారణం అయిందన్నారు. రైతులకు, సామాన్య ప్రజలకు, నిరాశ్రయులకు వర్ష ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
వరదపై సమీక్ష :పురుషోత్తమాయగూడెం ప్రమాద ఘటనలో తండ్రీకుమార్తె మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు, వాగులు, ప్రమాద స్థాయిలో ఉండడం వల్ల ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీస్ సిబ్బంది చూడాలని ఆదేశించారు. సామాన్య ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.