Minister Seethakka About Rythu Runa Mafi : ఇప్పటికే గత రెండు మూడు నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, దీపావళి తర్వాత మరో నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పర్యటించిన ఆమె, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.
భూమి పట్టాలు చేయిస్తామంటూ దళారులు వస్తున్నారని, ఎవరిని నమ్మొద్దని మంత్రి సీతక్క సూచించారు. ప్రభుత్వమే సర్వేలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇస్తోందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏజెన్సీల్లో గిరిజనులు, గిరిజన నేతరులకు సాగు చేసుకుంటున్న భూములుకు పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. వాటిని గుర్తించి ఎవరు భూములు వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కొంతమంది దళారులు కలెక్టర్, డీఎఫ్ఓడీ, ఇతర ఫారెస్టు అధికారులు సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ పట్టాలను సృష్టించారని చెప్పారు. ఆ ముఠాను ఇప్పటికే ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.