Men Dress Up Like Women To Perform Rituals :పెళ్లి వేడుకల్లో వధూవరులకు ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. ఆయా ప్రాంతాలు, ఆచార వ్యవహారాలపై ఇది ఆధారపడి ఉంటుంది. అందులోనూ పలు ప్రత్యేకతలు ఉంటాయి. ఇటువంటిదే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలోనూ ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. పెళ్లి కుదిరిందంటే చాలు ఇక్కడ ఒక రోజంతా 'జంబలకిడి పంబ'గా తిరగాల్సిందే. పెళ్లయ్యే యువకుడు అమ్మాయిలా అలంకరించుకొని రావాల్సి ఉంటుంది. అమ్మాయి అబ్బాయిలా పంచె ధరిస్తుంది. ఇదెక్కడి ఆచారం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
చీర కట్టి అమ్మాయిలా : ప్రకాశం జిల్లా శానంపూడి పంచాయతీ పరిధిలోని పటికనేనివారి పాలెంలో కోడిపల్లి అనే ఇంటి పేరు కలిగిన కుటుంబాలు సుమారు 100 వరకు జీవిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. పాడిని అనుబంధంగా చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ తమ దైవంగా నాగార్పమ్మను పూజిస్తుంటారు. ఈ కుటుంబాల్లోని ఎవరైనా యువకుడికి వివాహం కుదిరితే చాలు తమ ఆచారాలతో జరిపిస్తారు. అబ్బాయికి చీర కట్టి అమ్మాయిలా తయారు చేస్తారు. అమ్మాయికి పంచె కట్టి, చొక్కా ధరింపజేసి యువకుడిగా అలంకరిస్తారు.