Manchu Vishnu about Family Dispute : ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, తమ ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ వివాదం తమ మనసులను ఎంతో బాధపెడుతోందని పేర్కొన్నారు. గత రెండ్రోజులుగా మంచు కుటంబంలో జరుగుతున్న వివాదంపై తాజాగా స్పందించిన మంచు విష్ణు, తమను విపరీతంగా ప్రేమించడమే తన నాన్న చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరమని మంచు విష్ణు పేర్కొన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, తన నాన్న మోహన్‌బాబు నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారని గుర్తుచేశారు. తన నాన్న మొహంమీద మైకు పెట్టడంతో క్షణికావేశంలో కొట్టారని వివరించారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మాట్లాడానని తెలిపారు. నిన్నటి ఘటన అలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు. నిన్నటి ఘర్షణలో తన నాన్నకు కూడా కొన్ని గాయాలయ్యాయని తెలిపారు. తాను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయని విష్ణు చెప్పారు.
'నేను ఇంట్లో ఉండి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. ఆస్తులన్నీ నాన్న స్వార్జితం వాటిపై హక్కు ఆయనదే. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.కొందరికి చిన్న కుటుంబం అంటే ఇష్టం. నా ఇంట్లో ఉండొద్దని నాన్న అంటే ఆ మాటకు గౌరవమివ్వాలి'- మంచు విష్ణు