తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ 3 రోజులు ఇలా చేస్తే - ఈ సంక్రాంతి జీవితాంతం గుర్తుండిపోతుంది! - SANKRANTI FESTIVAL SPECIAL STORY

సంక్రాంతి వేడుకలను హడావుడిగా చేసుకోకుండా, బంధు మిత్రులతో ఆనందంగా గడపండి - మీ పిల్లలకు పల్లె వాతావరణం, బంధుత్వపు మాధుర్యాన్ని తెలియజేయండి

Sankranti Festival 2025 Special Story
Sankranti Festival 2025 Special Story (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 7:29 AM IST

Sankranti Festival 2025 Special Story :బస్సులు కిక్కిరిసిపోయాయి. రైళ్లు కిటకిటలాడాయి. విమానాల్లోనూ ఖాళీలు లేవు. రోడ్లపై ట్రాఫిక్‌ పద్మ వ్యూహాలను ఛేదించుకుని సొంతూళ్లకు చేరుకున్నారు. ఈ 3 రోజులూ బంధువులతో సందడిగా గడిపేసి, సంక్రాంతి పండగను ఆహ్లాదంగా చేసుకుంటారు. ఆ వేడుకలను సెల్ ఫోన్స్​లో బంధించి, స్టేటస్‌లలోనో, ఇన్‌స్టాలోనో పోస్ట్‌ చేసేసి హడావుడిగా తిరిగి వచ్చి మళ్లీ రోజువారీ పనుల్లో పడిపోతాం. పండగంటే అంతేనా? 3 రోజుల ముచ్చటేనా? ఈ సంక్రాంతి శోభ సంవత్సరమంతా ఉంటే, ఉండాలంటే ఏం చేయాలో చూద్దామా?

ఆనంద సౌధాన్ని నిర్మించుకుందాం :సంక్రాంతి పండుగ వేడుకలు బాగా చేసుకుంటున్నారా? అమ్మ చేసిన అరిసెలు, అత్తమ్మ చేతి సకినాలు, చిన్ననాటి స్నేహితుల కబుర్లు వింటూ పిల్లలకు చెప్తూ ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకుని, తిరుగుపయనమవుతామో లేదో మళ్లీ మాములే. గజిబిజి పరుగులు, ట్రాఫిక్‌ జామ్‌లు, గందరగోళాలు, తలకుమించిన భారాలు. మళ్లీ సంవత్సరం తరువాతే సంక్రాంతి సందడిని రుచి చూసేది. అందుకే అంత ఆనందాన్నీ ఈ 3 రోజులకే సరిపెట్టకుండా, ఆ అనుభూతులను ఆసరాగా చేసుకుని సంవత్సరమంతా ఆనంద సౌధాన్ని నిర్మించుకుందాం.

పిల్లలతో మీ మధుర జ్ఞాపకాలు పంచుకోండి : పట్టణాల్లో, నగరాల్లో ఎవరికి వారే యమునా తీరే! అదే ఊర్లో ఇంట్లోంచి బయటకు వస్తే అమ్మమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, అత్తయ్య, మామయ్య అంతా బంధువులే. ఎవరేం వరసో, ఎవరెలా చుట్టమో, పిల్లలకు పరిచయం చేస్తే ఆ మమకారం మనసులపై ముద్ర వేస్తుంది. మన చిన్ననాటి స్మృతులు వాటితో సంబంధం ఉన్న ప్రదేశాలు వివిధ అనుభవాలను పిల్లలకు తెలియజేయాలి. పుస్తక వాసనలు, ఆన్‌లైన్‌ స్నేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పిల్లల మెదళ్లకు మీరు పంచే మధుర జ్ఞాపకాలు సాంత్వన కలిగిస్తాయి.

చిరకాల స్నేహితులతో కలవండి :చిన్నతనంలో ఆటలు ఆడినవారు. మీతోనే చదువుకున్న మీ మిత్రులు, సొంతూళ్లో మీకు బాగా ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే వారిని కలిసిరండి. వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకోండి. మీరు చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ మనసారా నవ్వండి. ఊళ్లో ఉన్న మిత్రులతో కలిసి మీరు చదువుకున్న పాఠశాలకు వెళ్లండి. మీరు నేర్చుకున్న పాఠాలను ఓసారి గుర్తు చేసుకోండి. బడికి మీ వంతుగా ఏదైనా సాయం చేయండి. మీ గుర్తుగా అక్కడ ఓ మొక్కను నాటండి. మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కలిసేందుకు ప్రయత్నం చేయండి. వారి ఆశీర్వాదాలు తీసుకోండి.

పిల్లలకు చెప్పండి :సంక్రాంతి పండగ సెలవులు పూర్తై తిరుగు ప్రయాణమవ్వడం పిల్లలకు ఎంత కష్టంగా ఉంటుందో. అప్పటిదాకా అమ్మమ్మ చెప్పిన కథలు, ఊరు చెరువు అందాలు, తోటి పిల్లలతో ఆడుకున్న కొత్త ఆటలు, వాటన్నిటినీ మిస్‌ అవుతామనే బాధ వారిలో కనిపిస్తుంటుంది. మీ సొంతూరి జ్ఞాపకాలను తరచూ పిల్లలతో షేర్ చేసుకోండి. బంధువులు, మిత్రుల ఇళ్లకు తీసుకెళ్లండి. అందరినీ పరిచయం చేయండి. బంధుత్వపు మాధుర్యాన్ని తెలియజేయండి.

మార్గదర్శనం చేయండి :మీరు ఉన్నత చదువులు అభ్యసిస్తే, మీ బందువుల పిల్లలకు కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇవ్వండి. వారు ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఫ్యూచర్​లో ఏ కోర్సులు చేస్తే బాగుంటుందో వారికి అవగాహన కల్పించండి. మీ అనుభవ పాఠాలు పిల్లలకు చెప్పండి. జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలో, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలో, వాటిని చేరుకోవడానికి చేయాల్సిన కృషి ఏంటో వివరించండి. నాలుగు మంచి మాటలు చెప్పి వారు భవిష్యత్తుకు సహాయం చేయండి.

వంశవృక్షం ఉందా? :మీ ఇంటి పేరుపై ఒక వంశ వృక్షాన్ని తయారు చేయండి. మీ పేరెంట్స్ మొదలు పెట్టి వారి సోదరులు, సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు, నాయినమ్మ, మీ తాతలు, అమ్మమ్మలు ఇలా వివరాలు సేకరించి వాటిని ఓ పేపర్‌పై పెడితే అందరూ ఆనందపడతారు. అది ఓ జ్ఞాపకంగా కొనసాగుతుంది. పిల్లలకు సైతం బంధుత్వాలు సులభంగా అర్థం అవుతాయి.

కాస్త తిరిగివ్వండి : 'సొంతూరు మీకు చాలా ఇచ్చే ఉంటుంది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి కాదా. లేదంటే లావు అయిపోతాం'’ ఓ మూవీ డైలాగ్. దీన్ని మీ నిజ జీవితానికీ అనుసంధానించండి. మీరు పుట్టిన సొంతూరికి ఉపయోగపడేలా ఏదైనా చేయండి. దానికోసం మీరు లక్షల్లో, కోట్లలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఊరి లైబ్రరీకి కొన్ని పుస్తకాలు ఇవ్వచ్చు. ఓ వీధిని ఎంచుకుని మొక్కలు నాటించ వచ్చు. ఊరును శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులకు చిన్న బహుమతులు ఇవ్వండి. ఇలా మీకు ఉన్న దానిలో నలుగురితో పంచుకోండి.

సొంతూరు వచ్చినా, ఆఫీస్‌ వర్క్ అంటూ వాట్సప్‌ ఛాటింగ్, ఇన్‌స్టా గ్రామ్ రీల్స్‌ అంటూ వాటిని పట్టుకుని వేలాడకండి. డిజిటల్‌ ప్రపంచం నుంచి సంక్రాంతి పండగ 3 రోజులు బయటకు రండి.

సంక్రాంతికి ఊరెళ్లలేదా? - హైదరాబాద్​లోని ఈ ప్రాంతాలకు వెళ్తే 'పండుగ' చేస్కుంటరు

తెలంగాణలో చిన్నారులు నోచే "గురుగుల నోము" - మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details