Lawyer Venkata Ramana Died in Sceendrabad indian Bank : హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో లాయర్ వేణుగోపాలరావు మృతి చెందిన ఘటనల జరిగి 24 గంటలకు గడవక ముందే మరో లాయర్ మరణించారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఇండియన్ బ్యాంకులో సికింద్రాబాద్ కోర్టు న్యాయవాది వెంకటరమణ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
తార్నాకకు చెందిన వెంకటరమణ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు కోర్టు చలాన్ చెల్లించడానికి మారేడుపల్లిలోని పుష్పగిరి ఆస్పత్రి పక్కనే ఉన్న ఇండియన్ బ్యాంకుకు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడు. బ్యాంకులో కిటికీకి కట్టి ఉన్న చలాన్ పేపర్ తీస్తున్న సమయంలో ఒక్క సారిగా కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయమైంది. బ్యాంక్ సిబ్బంది వైద్యుడిని తీసుకురాగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమార్తె బ్యాంకు వచ్చి తండ్రిని చూసి బోరున విలపించింది.
విషయం తెలుసుకున్న మారేడుపల్లి పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు . పెద్ద కుమార్తె యూఎస్‌లో ఉంటుంది. రెండో కుమార్తె తండ్రి వద్ద ఉంటుంది. కొద్ది రోజుల్లో చిన్న కుమార్తెకు పెళ్లి నిశ్చయమైందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గుండెపోటుతో లాయర్ వేణుగోపాలరావు మృతి : హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది వేణుగోపాలరావు కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే
రెగ్యులర్ పిటిషన్ల వాయిదా : లాయర్ వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆయన కూప్పకూలారు. ఇది గమనించిన తోటి లాయర్లు వెంటనే వేణుగోపాలరావును అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. లాయర్ మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.