TG High Court Dismissed The Petition : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్‌పై న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలన్న నరేందర్ రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెరిట్స్ ఆధారంగా పరిశీలించాలని సంబంధిత కోర్టును హైకోర్టు ఆదేశించింది. లగచర్ల దాడి ఘటనలో బోంరాస్‌పేట పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. గత నెల 13వ తేదీన నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, కొడంగల్ కోర్టులో హాజరుపర్చిన సంగతి తెలిసిందే.
అధికారులపై దాడికి పట్నం నరేందర్ రెడ్డి కుట్ర పన్నారని, ఈ మేరకు ప్రజలను రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పలు సందర్భంగా బహిరంగంగా మాట్లాడి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగా కొడంగల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డికి గత నెలలో రిమాండ్ విధించింది.
అసలు వాంగ్మూలమే ఇవ్వలేదు : దీంతో పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు తప్పుడు అంశాలు పేర్కొన్నారని, కోర్టు సైతం వాటిని పరిశీలించకుండానే రిమాండ్ విధించిందని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూసేకరణకు వ్యతిరేకంగా గొడవ వాతావరణం సృష్టించినట్లు తాను వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని తెలిపారు. తన నుంచి ఎవరూ వాంగ్మూలం సేకరించలేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.