CM Revanth Davos Tour : దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో పది ప్రముఖ సంస్థలతో రూ.1,32,500 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 46వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పెట్టుబడులు మూడింతలు పెరిగాయి. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్‌లో అమెజాన్ వెబ్‌సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకెల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రూ.60వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకరించింది. రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది.
మేఘా ప్రాజెక్టుతో భారీగా ఉద్యోగాలు : తెలంగాణలో రూ.15 వేల కోట్లతో ఆధునిక పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 7వేల మంది ఉద్యోగాలు కల్పించే అవకాశముంది.
ఏఐ డేటా సెంటర్లు : ఏఐ డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ప్రముఖ సంస్థ కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.10వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దావోస్‌లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. 400 మెగావాట్లతో కంట్రోల్ ఎస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ క్లస్టర్ ద్వారా 36వేల మంది ఉద్యోగాలు లభించనున్నాయి.
తెలంగాణలో యూనిలివర్ పెట్టుబడులు - సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో పలు ఒప్పందాలు
ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం : జేఎస్‌డబ్ల్యూ కంపెనీ తెలంగాణలో రూ.800 కోట్లతో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేసేలా జేఎస్ డబ్యూ యూఏవీ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. రూ.500కోట్లతో రాష్ట్రంలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు 'స్కైరూట్' ముందుకొచ్చింది.
హెచ్సీల్ టెక్ ఏర్పాటు : ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఎల్ కొత్త సెంటర్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్లౌడ్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3లక్షల 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీల్ టెక్ ఏర్పాటు చేసే క్యాంపస్‌లో దాదాపు 5000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్ విస్తరణ : హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను విస్తరించనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పడం ద్వారా మరో 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మరోవైపు రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. మేడ్చల్ జిల్లా పోచారంలోని ఐటీ క్యాంపస్‌ను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. దావోస్‌లో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. పోచారంలో రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడుతామని ఇన్ఫోసిస్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ విస్తరణతో కొత్తగా 17 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో డేటా సెంటర్లు : దావోస్ చివరి రోజు పర్యటనలో రాష్ట్రప్రభుత్వం మరో రెండు పెట్టుబడులను రాబట్టింది. హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.4,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బ్లాక్‌స్టోన్ సంస్థ ముందుకొచ్చింది. మరోవైపు మహానగరంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఉర్సా క్లస్టర్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం - ఒకే రోజు రూ.56,300 కోట్లు
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు - రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 'కంట్రోల్ ఎస్'