KTR Open Letter to CM Revanth Reddy :బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండగలా కళకళలాడిన చేనేత రంగం, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు ఉన్న విపత్కర పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోందని అన్నారు. హస్తం పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరమవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
KTR on Handloom Workers Facing Problems :రాష్ట్రంలోని నేత కార్మికుల సమస్యలపై (Handloom Workers Problems) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సర్కార్‌కు చిత్త శుద్ధి, ముందు చూపు లేకపోవడంతో వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపించారు. వారు ఉపాధి కోల్పోయి, జీవితాలు దుర్భరంగా మారుతున్నా ప్రభుత్వానికి కనీస కనికరం లేదని ఆక్షేపించారు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ, సర్కార్‌లో ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయమని కేటీఆర్ మండిపడ్డారు.
చేనేత కార్మికుల పాలిట పెనుశాపంగా విద్యుత్ బిల్లులు.. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి
'ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం, వారి మనోస్థైర్యాన్ని మరింతగా దెబ్బతీస్తోంది. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రతి కార్మికుని గుండెను గాయపరిచాయి. ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హస్తం పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారని' కేటీఆర్ ఆరోపించారు.
కార్మికుల జీవితాల్లో గుణాత్మక మార్పు :చేనేత రంగానికి (Handloom Workers) పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ హయాంలో సాగిన మహాయజ్ఞం ఎన్నో గొప్ప ఫలితాలను ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో వస్త్రపరిశ్రమ విస్తరించి వివిధ ప్రాంతాలతో పాటు ఒకప్పుడు ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనిందని వివరించారు. నేతన్నకు బీమా అమలుతో కార్మికుల కుటుంబాలకు ధీమా లభించిందని, ఓవైపు కార్మికుల సంక్షేమం, మరోవైపు సమగ్ర అభివృద్ధితో వారి జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు.
కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు : పదేళ్ల పాటు పండుగలా మారిన వస్త్ర పరిశ్రమ చుట్టూ మళ్లీ కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు కార్మికుల జీవితాలతో చెలగాటమాడేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తీరు మార్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని కేటీఆర్ తెలిపారు.
KTR on Handloom Workers Facing Problems :బతుకమ్మ చీరల ఆర్డర్లకు ఇప్పటికీ ఉత్తర్వు రాకపోవడంతో వాటిపై ఆధారపడిన వారి ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతోందని కేటీఆర్ అన్నారు. 35,000ల మంది కార్మికులు, కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్యపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, నూలు రాయతీని కూడా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.