KTR Tweet On Pension Recovery :కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలిక ఊడినట్లుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్తగూడెం జిల్లాలో ఓ వృద్ధురాలు పింఛన్ కింద వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న నోటీసులపై ఆయన ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలు పెట్టిందని ఆక్షేపించారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ, వేలాది మంది ఆసరా పింఛన్ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
KTR Comments On Congress : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పింఛన్ కింద వచ్చిన రూ.1.72 లక్షలను వెనక్కి కట్టాలని నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పింఛన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు.