తెలంగాణ

telangana

ETV Bharat / state

మీరు మీరు తేల్చుకోండి - నీటి పంపకాలపై కేఆర్‌ఎంబీ స్పష్టం - KRMB MEETING ON KRISHNA WATER

ముగిసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం - నీటి అవసరాలపై ఇరురాష్ట్రాల సీఈలు నిర్ణయానికి రావాలన్న కేఆర్‌ఎంబీ

Krishna River Management Board Meeting
Krishna River Management Board Meeting (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 6:47 PM IST

Krishna River Management Board Meeting :నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల కింద రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని నీటి అవసరాలపై ఓ నిర్ణయానికి రావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ సూచించారు. రెండు రాష్ట్రాల సంబంధిత చీఫ్ ఇంజనీర్లు మంగళవారం సమావేశమై ఓ అభిప్రాయానికి రావాలని పేర్కొన్నారు. ఆ తర్వాత బుధవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమై నీటి విడుదల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పది టీఎంసీలు అందుబాటులో ఉంచాలి :కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకున్నందున నిలువరించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బోర్డు ఛైర్మన్​ను కోరారు. శ్రీశైలం నుంచి ఉన్న పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, తదితరాల ఔట్ లెట్ల నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తి ఆపాలని అన్నారు. తాగునీటి అవసరాల కోసం తమకు శ్రీశైలం, నాగార్జునసాగర్​లో పది టీఎంసీల చొప్పున అందుబాటులో ఉంచాలని కోరారు.

సముద్రంలోకి వృధాగా పోయే వరద నీటిని తాము వినియోగించుకున్నామని, పరిగణలోకి తీసుకోరాదని ఏపీ ఈఎన్సీ అన్నారు. సాగర్, శ్రీశైలం కింద పంటలు ఉన్నాయని, వాటికి సరిపడా నీరు అవసరమని పేర్కొన్నారు. వరద జలాల వినియోగానికి సంబంధించి కూడా సమావేశంలో లెక్కలు తీసినట్లు తెలిసింది. నల్గొండ సీఈ అజయ్​తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో ఉన్నందున అందుబాటులోకి రాలేదు. దీంతో ఏపీ సీఈని మంగళవారం నల్గొండ వెళ్లి అక్కడే మాట్లాడాలని సూచించారు. ఆ తర్వాత బుధవారం జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్​లు విడిగా సమావేశమయ్యారు.

ఆంధ్రపదేశ్ ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటోంది :ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల్లో తెలంగాణకు 131, ఆంధ్రప్రదేశ్ కు 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల11 వ తేదీ వరకు నాగార్జున సాగర్​లో 510 అడుగుల పైన 63, శ్రీశైలంలో 834 అడుగుల పైన 30 టీఎంసీల నీరు మిగిలి ఉంది. రెండు జలాశయాల్లో నీటి నిల్వలు, జూన్ - జూలై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ ఔట్ లెట్ల నుంచి నీరు తీసుకునే ప్రణాళిక వివరాలు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది. అటు ఆంధ్రపదేశ్ ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటోందని, తెలంగాణ ప్రభుత్వం బోర్డు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రోజులు క్రితం ఫిర్యాదు చేసింది.

జగన్‌తో స్నేహంగా ఉంటూ ఏపీ నీళ్ల దోపిడీని కేసీఆర్‌ ఏనాడు అడ్డుకోలేదు : మంత్రి ఉత్తమ్‌

కృష్ణా జలాల వివాదం - రేవంత్ రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమో : హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details