Kishan Reddy on State Budget :కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే, కాంగ్రెస్ పాలన అంకెల గారడీతో పాటు మాటల గారడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననేభావన ప్రజల్లో వ్యక్తమవుతోందని మండిపడ్డారు. అసెంబ్లీలో(Telangana Assembly) ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి, మొత్తం మీద ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందని అన్నారు.
రూ.2.95 లక్షల కోట్లతో నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్! - ఆరు గ్యారంటీలకే పెద్దపీట
ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప, వారిచ్చిన ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని విమర్శించారు. కేంద్రమంత్రి విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
Telangana Budget 2024 :వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి(Seed Development) పరిస్థితేంటని ప్రశ్నించారు. అనేక వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్నారు. అవి నీటిమీద రాతలేనా, కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ, ఇక అమలుకానట్టేనని వ్యాఖ్యానించారు.