Kamma Sangam Paid Tributes to Ramoji Group Chairman Ramoji Rao : పత్రిక ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టించి ఎంతో మందికి జీవితాన్నిచ్చిన ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఎంతో మందికి ఆదర్శమని సినీ నటుడు మాగంటి మురళీ మోహన్ అన్నారు. చిన్నప్పటి నుంచే కష్టపడి చదివి విజయం సాధించారని తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంలో రామోజీరావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని అమీర్ పేటలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఈ సంస్మరణ సభలో ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినీ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ చేపట్టిన ప్రతి పనిని దిగ్విజయంగా రామోజీరావు విజయం సాధించారని తెలిపారు. అన్ని రంగాల్లో ఎలా ఎదగాలో చెప్పేందుకు ఆయన మార్గదర్శిగా నిలిచారన్నారు. భౌతికంగా ఆయన మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మనతో ఎల్లప్పుడూ ఉంటాయని త్రిపురనేని హనుమాన్ చౌదరి అన్నారు. రామోజీరావుకు ఉన్న ముందు చూపు వల్ల ఆయన అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని జస్టిస్ చల్లా కోదండరామ్ పేర్కొన్నారు.
"ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకొని ఈనాడు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత అద్భుతమైన ఫిల్మ్‌సిటీ లేదు అన్నట్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీని నిర్మించారు. ఈ ఘనత ఆయనదే. ఎన్టీఆర్‌తో పాటు రామోజీరావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలి."- మురళీ మోహన్, సినీ నటుడు