Nagarjuna Sagar Ten Gates Opened Today :కరవు పరిస్థితుల నేపథ్యంలో గతేడాది వెలవెలబోయిన నాగార్జునసాగర్, ప్రస్తుతం నిండుకుండలా మారి కలకలలాడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుండటంతో అధికారులు 16 గేట్లు ఎత్తారు. తొలుత 6 గేట్లను ఎత్తిన అధికారులు క్రమంగా 16 గేట్లను తెరిచారు.
ముందుగా నాగార్జునసాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం మరో పది గేట్లను క్రమక్రమంగా ఎత్తారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్‌ను మోగించారు. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు రావడంతో ఇవాళ గేట్లు ఓపెన్ చేశామని నాగార్జునసాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తిన అధికారులు : మొత్తం పదహారు క్రస్టు గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వరద నీరు ఫ్లో ఆధారంగా మరిన్ని గేట్లు ఓపెన్ చేస్తామన్నారు. సాగర్ గేట్లు తెరుచుకోవడంతో, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తోంది. సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది.
పోటెత్తుతున్న వరద : ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ప్లో 3,23,969 క్యూసెక్కులు ఉండగా, 1,63,691 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 584.40 అడుగులకు చేరింది. 312.50 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్ధ్యానికి ప్రస్తుత నీటి నిల్వ 294.70 టీఎంసీలు ఉంది. మొత్తం పదహారు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.