Investment Fraud in Hyderabad : పార్ట్‌టైం ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ, మనువల్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు పెన్‌డ్రైవ్‌లు, 7 పాస్‌బుక్‌లు, 33 చెక్‌బుక్‌లు, 25 డెబిట్ కార్డులు, 5సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం : నగరానికి చెందిన ఓ మహిళకువాట్సాాప్లో పరిచయం అయిన దుబాయ్‌కి చెందిన రైసుల్ ఆమెను టెలిగ్రామ్ యాప్‌లోని (Telegram App Scams) ఓ గ్రూప్‌లో యాడ్ చేశాడు. అక్కడ క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. అదే గ్రూప్‌లో రైసుల్ అనుచరులు (జానీ, మనువల్) ఉండి తమకు కూడా లాభాలు వచ్చాయంటూ స్క్రీన్ షాట్లు పెట్టారు. ఇది నిజమేనని నమ్మిన మహిళ అతను చెప్పిన క్రిప్టో ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసింది. అందులో విడతల వారీగా రూ.49.45లక్షలు పెట్టుబడి పెట్టింది.
ఆమె బదిలీ చేసిన నగదును జానీ, మనువల్ సమకూర్చిన ఖాతాల్లో జమ చేశారు. అనంతరం యాప్ పనిచేయడం ఆగిపోయింది. మోసపోయాయని గుర్తించిన మహిళసైబర్ క్రైమ్ (Cyber Crimes) పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు జానీ, మనువల్ అరెస్ట్ చేశారు. ఖాతాలు సమకూర్చినందుకు రైసుల్ వారిద్దరికీ 3 శాతం కమీషన్ ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దేశ వ్యాప్తంగా జానీ, మనువల్ సమకూర్చిన ఖాతాలు 50కి పైగా సైబర్ నేరాల్లో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.