Secunderabad to Mumbai Four Line Train Way :ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయి. పుణె, ముంబయి వైపు వెళ్లే సికింద్రాబాద్-వాడి మార్గాన్ని రెండు లైన్ల నుంచి క్వాడ్రాప్లింగ్ (నాలుగు లైన్ల)కు విస్తరించాలని రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను రైల్వే బోర్డుకు అందింది. దీనికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ ప్రాజెక్టు మంజూరవుతుంది. అదే కాకుండా రాష్ట్రంలోని మరో రెండు లైన్ల మంజూరు అంశం కూడా కీలక దశలో ఉంది. కరీంనగర్-హసన్‌పర్తితోపాటు డోర్నకల్-మిర్యాలగూడతో కొత్త రైల్వే లైన్లకు సంబంధించిన డీపీఆర్‌లు కొన్నిరోజుల క్రితమే రైల్వే బోర్డుకు చేరాయి.
ఈ మూడు ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ.7,840.37 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే మూడు ప్రాజెక్టులకు సంబంధించిన అంచనా వ్యయం, అలైన్‌మెంట్, దూరం వివరాలను సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే బడ్జెట్లోనే మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని నుంచి పుణెకు వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ముంబయికి వెళ్లే హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు వికారాబాద్, వాడి మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం వాడి వరకు కేవలం రెండు లైన్ల రైలు మార్గం ఉంది. భవిష్యత్‌లో అవసరాలకు అనుగుణంగా ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.
అనుసంధానంలో కీలకం :ప్రాథమిక సర్వేతోపాటు ఫైనల్ లొకేషన్ సర్వేలు సైతం పూర్తయ్యాయి. డోర్నకల్-మిర్యాలగూడ కొత్త రైల్వే లైనుతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, దిల్లీ రైలు మార్గాలు సైతం అనుసంధానమవుతాయని రైల్వేశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతిపాదిత మార్గం ముఖ్యంగా సరకు రవాణాకు అత్యంత కీలకం అవుతుంది. మిర్యాలగూడ సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా ఎంతో ఉపయోగపడుతుంది. నల్గొండ జిల్లాలో సిమెంటు పరిశ్రమలకు ఈ మార్గం చాలా ఉపయోగం ఉంటుంది. హసన్‌పర్తి నుంచి హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ వరకు కొత్త రైలు మార్గం డిమాండ్ ఎప్పటి నంచో ఉంది.
ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలంటూ గతంలో అప్పటి కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ప్రస్తుత ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ రైల్వేశాఖకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌కు కాజీపేట, రామగుండం, బల్లార్ష, వార్దా మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. హసన్‌పర్తి- కరీంనగర్ మార్గం మంజూరు అయితే హనస్‌పర్తి నుంచి హుజూరాబాద్, కరీంనగర్‌కు మళ్లీ అక్కడి నుంచి ఇప్పటికే ఉన్న కరీంనగర్-జగిత్యాల-నిజామాబాద్-బాసర-నాందేడ్-ఔరంగాబాద్ మార్గంలో రైళ్లు రాకపోకలు సాగించవచ్చు. హసన్‌పర్తి- కరీంనగర్ మంజూరు అయితే 40 కి.మీ. మేర దూరం తగ్గుతుంది. ప్రస్తుతం కాజీపేట-బల్లార్ష మార్గంలో పరిమితికి మించి రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ - వివరాలివే - Hyderabad To Goa Special Train