HYDRA Demolish Illegal Structures in Hyderabad : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ బృందాలు హైదరాబాద్ మహా నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నాయి. మాదాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ఓ అపార్ట్మెంట్ను కూల్చివేసింది. దుండిగల్ మల్లంపేట కత్వా చెరువులోని అనధికారిక విల్లాలను సైతం హైడ్రా నేలమట్టం చేసింది. ఎఫ్టీఎల్లో ఉన్న మూడు నిర్మాణాలు, బఫర్ జోన్లో ఉన్న 5 విల్లాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ అనధికారికంగా కత్వా చెరువులో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు గత సోమవారం పరిశీలించారు.
మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు :సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. వీటిలో భారీ షెడ్స్, భవనాలు ఉన్నాయి. వీటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న సర్వే నంబర్లు 12,13,14,16లలో పదుల సంఖ్యలో షెడ్స్ను నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీటన్నింటిపై హైడ్రా అధికారులు, స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నటువంటి నాలుగు అంతస్తులు, రెండు అంతస్తుల భవనాలు, ముప్పైకిపైగా షెడ్లను అధికారులు నేలమట్టం చేసి పది ఎకరాల చెరువు భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
కత్వా చెరువులో నిర్మాణాలు కూల్చివేత : ఇదే రీతిలో దుండిగల్ కొత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పదకొండు డూప్లెక్స్ విల్లా భవనాలను అధికారులు తొలగించి రెండు ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలాగే మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాలను నిర్మించింది. అయితే వారు 60 విల్లాలకే హెచ్ఎండీ పర్మిషన్ తీసుకున్నారు. మిగతావి ఫోర్జరీ సంతకాలతో నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మేడ్చల్ కలెక్టర్ హరీశ్ నేతృత్వంలో డీపీఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు అనుమతి లేవని నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. వీటికి హైకోర్టు కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్, బ్యాంక్ అధికారులు లోన్లను నిలిపివేయాలని ఆర్డినెన్స్ ఇచ్చింది.