BJP MP Etala Slaps Land Grabber In Pocharam : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ స్థిరాస్తి దళారిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో మంగళవారం ఎంపీ ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ క్రమంలో అతనిపై చేయిచేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదలు కొనుక్కున్న స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. పేదలు కొనుక్కున్న భూముల సమస్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడారని తెలిపారు. కొందరు దొంగ పత్రాలు సృష్టించి పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారన్నారు. ప్రభుత్వం కూల్చివేతలే తప్ప, ప్రజల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, పోలీసులు, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి, పేదలు కట్టుకునే ఇళ్లపై దౌర్జన్యం చేస్తున్నారు. నా దగ్గరికి ఏకాశిలానగర్ కాలనీవాసులు వచ్చారు. 1985లో ఇక్కడ తక్కువ ధరలకు భూములు వచ్చాయి. అప్పుడు కొనుక్కున్నారు వీళ్లంతా. కొన్నవారిలో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో ఇక్కడా ఎవరూ లేదు, భద్రతా పరంగా ఇబ్బందులు వస్తాయని ఇళ్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఇళ్లు కట్టుకుందాం అంటే అందుకు అనుమతులు ఇవ్వడం లేదు." - ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీ