Tiger Spotted In Adilabad District : పులి అంటే చాలు ప్రజల్లో వణుకు పుడుతుంది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే పులులు గత కొద్ది రోజులుగా జనావాసాల్లో ఏదో ఒక చోట కనిపించడం, మరికొన్ని చోట్ల పాదముద్రలను అధికారులు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా పెద్దపులి సంచారం ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయదారులు, సామాన్య ప్రజానీకం, అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్ద పులులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి కే శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పిప్పల్ కోటి ప్రాజెక్టు పనులు చేస్తున్న వాహన డ్రైవర్లకు సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న పులి కనిపించింది. పులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను ఒకరు సెల్ఫోన్లో రికార్డు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. గుర్తులు కనిపించిన ప్రదేశాన్ని సందర్శించి అడుగులను పరిశీలించి పులి సంచారం నిజమేనని ఎఫ్ఎస్ఓ హైమద్ ఖాన్ తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు గుంపులుగా పంట పొలాలకు వెళ్లాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పొలాల్లో ఉండవద్దని తెలిపారు. రాష్ట్రం సరిహద్దులోని మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెనుగంగ నది దాటి తాంసి శివారులోకి పులి అడుగు పెట్టినట్లు అటవీ అధికారులు తెలిపారు.
Male and Female Tigers Roaming In Adilabad : గత నెలలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మగ పులి కోసం ఆడ పులి వెతుక్కుంటూ వచ్చింది. వారు భావించినట్లే మగ పులి ఏ ప్రాంతాల్లో తిరిగిందో ఆ దారి గుండా వెళ్లి పులి చెంత చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ క్షేత్రాల్లో కొద్ది రోజులుగా ఎస్-12 పులి సంచారం అలజడి సృష్టించింది. జిల్లాలోని జన్నారం కవ్వాల్ మీదుగా లక్షెట్టిపేట, మందమర్రి సెక్షన్‌లోని అందుగులపేట, కాసిపేట మండలంలోని ముత్యంపల్లిస దేవాపూర్ రేంజ్లో తిరుగుతూ కనిపించింది. ఈ ప్రాంతాల్లోని ఆవులపై సైతం దాడి చేస్తూ హతమార్చింది. దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతూ హడలెత్తించింది.
ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు వాటి జత కోసం అడవుల్లో సంచరిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబరు నుంచి జనవరి వరకు పెద్ద పులలు జతకట్టే సమయం కావడంతో మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా అభయారణ్యం నుంచి ఇక్కడికి వస్తుంటాయని అటవీ అధికారులు అంటున్నారు.
21రోజుల్లో 3రాష్ట్రాలు, 300 కి.మీ జర్నీ- ఎట్టకేలకు చిక్కిన ఆడపులి 'జీనత్'
పులి భయంతో బయటకు రాని జనం - ఆ జిల్లాలో నిలిచిపోయిన కీలక సర్వే