Wife And Husband Suicide :నిరుపేద కుటుంబం. శిథిలమైన పెంకుటిల్లు తప్ప మరే ఆధారం లేదు. రోజూ దంపతులిద్దరూ కూలికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వారు కష్టం చేసిన డబ్బులతో ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. అయితే వారు చేసిన కొద్దిపాటి అప్పు, దానికి ప్రతి వారం చెల్లించాల్సిన రూ. 200 కిస్తీ భారంగా మారాయి. అనారోగ్యాలు, ఖర్చులకుతోడు అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ భార్యాభర్తలు బలవన్మరణాలకు పాల్పడి ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మిగిల్చారు. ఈ విషాద ఘటన భూపాలపల్లి జిల్లాలో జరిగింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం:భూపాలపల్లి జిల్లాలోని కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరచి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు. కొన్ని నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘంలోని సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల అప్పు తీసుకున్నారు. ఈ రుణానికి ప్రతి వారం రూ. 200 కిస్తీ కట్టాలి. కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించారు. కానీ భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో చందన కొన్ని నెలలుగా కిస్తీ కట్టలేకపోతుంది. దీనిపై ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.