Home Theatre Systems With Cinematic Sounds : ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. ఇంట్లోనే హాయిగా అందరితో కలిసి చూద్దాం అంటే హాల్లోని దృశ్య, శబ్ద నాణ్యత, సంగీతం ఉండవు. హోం థియేటర్ కొందామంటే రూ.లక్షల్లో ఖర్చువుతుందని అది కేవలం ధనవంతులకే అని సర్దిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హోం థియేటర్ మధ్యతరగతి ఇళ్లలో సైతం ఉంటోంది. పదుల కొద్దీ ఓటీటీలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలతో కొత్తలోకం కనిపిస్తుంది. ఇవే కాకుండా పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఇతర కార్యక్రమాల వీడియోలను హోం థియేటర్లో చూస్తేనే వంద శాతం సంతృప్తి అనేలా మారిపోతున్నారు. హోం థియేటర్లలో తెర, టీవీలు, సాంకేతికతకు అనుగుణంగా ధరలు రూ.50 వేల నుంచి మొదలవుతున్నాయి. చిత్రం, శబ్దంలో నాణ్యత కోసం గదిలో ఏర్పాటు చేసే ఆధునిక సౌకర్యాలను అనుగుణంగా ఈ ధర రూ.లక్ష నుంచి మొదలవుతుంది.
కోరుకున్నంత సాంకేతికత : హోం థియేటర్ అంటే రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగని పిక్చర్, సౌండ్ విషయంలో రాజీ పడాల్సింది కూడా లేదు. 4కే, అల్ట్రాహెచ్‌డీ, క్యూఎల్‌ఈడీ టీవీలు, డాల్బీ అట్మాస్, డీటీఎస్ ఎక్స్ శబ్ద సాంకేతికతతో అందుబాటులోకి వస్తున్నాయి. పలు కంపెనీల ఉత్పత్తులు నాణ్యతతో అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిస్తున్నాయి. దీంతో పెద్ద బ్రాండ్లు సైతం దిగొట్టి సామాన్యుడికి అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నాయి. 65 అంగుళాలు యూహెచ్‌డీ, క్యూఎల్‌ఈడీ టీవీలు రూ.35వేల నుంచి దొరుకుతున్నాయి. సౌండ్ సిస్టమ్‌కు రూ.15 వేలు పెడితే చాలు ఇంట్లోనే హోం థియేటర్ ఉంటుంది. ప్రముఖ కంపెనీలకు చెందినవైతే కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ, మినీ ఎల్‌ఈడీ టీవీలకు రూ.లక్షపైనే ఖర్చు పెట్టాల్సిందే. తెర పరిణామం పెరిగేకొద్దీ ధరలు పెరుగుతుంటాయి.
- టీవీలకు సంబంధించి నిట్స్‌లో కాంతిని కొలుస్తారు. ప్రస్తుతం ఉన్న వాటిలో సూక్ష్మ ఎల్‌ఈడీ డయోడ్లు, ఎల్ఈడీలు తెరపై శక్తిమంతమైన, స్పష్టమైన రంగుల్ని అందిస్తాయి. నిట్స్ ఆధారంగా వాటి నాణ్యత, ధర ఉంటుంది.
- సినిమా చూడాలన్నా పాటలు వినాలన్నా సౌండ్ క్వాలిటీ చాలా ముఖ్యం. దీన్ని డాల్బీ అట్మాస్ టెక్నాలజీ అందిస్తుంది. 360 డిగ్రీల కోణంలో శబ్ద తరంగాలను వ్యాపించేలా చేస్తుంది. ఓటీటీ ఛానెల్స్‌లో 4కే, 8కే, రిజల్యూషన్‌తో వచ్చే వీడియోలు ఈ విధానాన్ని సపోర్టు చేసేలా రూపోందిస్తున్నారు.
- హోం థియేటర్లో ప్రొజెక్టర్ ఖర్చే అధికం. ఇందులో ఎలాంటి రంగు గోడపై ప్రదర్శించినా, ఎగుడు, దిగుడుగా ఉన్న అందుకు అనుగుణంగా చిత్రాన్ని సెట్ చేసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇవి రూ.6వేల నుంచి రూ.17 లక్షల వరకు లభిస్తున్నాయి. 4కే, 8కే, ఫుల్ హెచ్‌డీ, నేటివ్ 4కే, తదితర సాంకేతికతకు అనుగుణంగా ధరల శ్రేణి ఉంటుంది.