High Court on Police Action to Woman Register Complaint :ఓ మహిళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లో గడపటానికి అదేమీ పర్యాటక ప్రదేశం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదు ఇవ్వలేదు, కేసు నమోదు చేయలేదంటూ పోలీసు చర్యనుప్రభుత్వ న్యాయవాది సమర్ధించడం సరికాదంది. కరీంనగర్‌లో ఓ జడ్జి కుమారుడు వికాస్ కుతాడిపై ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వంగ రమ్య అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
'కాళేశ్వరం ప్రాజెక్టు' వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటి : హైకోర్టు
ఈ పిటిషన్‌పై రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే(Justice Alok Aradhe), జస్టిస్ జె అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆఫీసు సబార్డినేట్‌గా జడ్జి ఇంట్లో విధులు నిర్వహిస్తున్న పిటిషనర్‌పై వికాస్ అనుచితంగా ప్రవర్తించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈనెల 13న పిటిషనర్ పోలీసు స్టేషన్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయలేదన్నారు.
ఎస్హెచ్ఓపై చర్యలకు ధర్మాసనం ఆదేశాలు : ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో కేసు నమోదుచేయలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ అక్కడికి వెళ్లడం వాస్తవమేనంటున్నప్పుడు ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది. జనరల్ డైరీలో అయినా నమోదు చేయాలి కదా అని నిలదీసింది. చట్టబద్ధ పాలన ఉన్న ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదంది.
కరీంనగర్ 2టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఓదెల వెంకట్‌పై శాఖాపరమైన చర్యలతో పాటు సస్పెన్షన్‌కు(Suspension) ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఓదెల వెంకట్‌ను రికార్డులతో పిలిపిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ను పిలిపించిన ధర్మాసనం పోలీసుల తీరును వివరించి ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది.
Telangana HC on MLC Issue :మరోవైపు గవర్నరు కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నరు కోటా కింద తమ నామినేషన్లను, గవర్నరు(Governor) తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణను కొనసాగించింది. శ్రవణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది, న్యాయవాది వీ మురళీ మనోహర్ వాదనలు వినిపిస్తూ ఇటీవల గవర్నరు నామినేట్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం దాఖలు చేసిన కౌంటరులో తాను రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పేర్కొన్నారన్నారు.