Tips to Avoid Cockroaches at Home : కొన్నిసార్లు ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా.. బొద్దింకలు అటూఇటూ తిరుగుతూ కనిపిస్తాయి. ఇక వంటింట్లో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. వంటింట్లోని సింక్, స్విచ్‌బోర్డులు, ప్లాస్టిక్ డబ్బాలు, కప్‌బోర్డులు.. ఇలా ఒక్కటేమిటి కిచెన్ మొత్తాన్ని ఆక్రమిస్తాయి. అయితే, దాదాపు అందరూ వీటిని తరిమికొట్టడానికి రకరకాల స్ప్రేలు వాడుతుంటారు. దీనివల్ల మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని తరిమికొట్టేందుకు కొన్ని నేచురల్ టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు. ఇంతకీ బొద్దింకలను తరిమికొట్టే ఆ చిట్కాలు ఏంటో మీరు చూసేయండి..
ఆరెంజ్ తొక్కలతో : బొద్దింకలను తరిమికొట్టడానికి ఆరెంజ్ తొక్కలు ఒక చక్కటి పరిష్కారమంటున్నారు. ఎందుకంటే ఆరెంజ్ తొక్కల్లో లిమోనెన్ అనే రసాయనం ఉంటుంది. ఈ వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. ఇందుకోసం మనం ఆరెంజ్ తొక్కలను పూర్తిగా ఎండలో ఆరబెట్టాలి. ఆపై వాటిని కిచెన్‌లో, ఇంటి మూలల్లో, బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ఉంచాలి. వీలైతే వాటిని పొడిగా చేసుకుని బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో చల్లుకోవచ్చు.
లవంగాలు, బిర్యానీ ఆకులతో : లవంగాల నుంచి వచ్చే ఘాటైన వాసన కూడా బొద్దింకలకు నచ్చదు. కాబట్టి, లవంగాలతో ఈజీగా బొద్దింకలను తరిమికొట్టవచ్చంటున్నారు. ముందుగా కొన్ని లవంగాలను తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఒక గ్లాసు నీటిని మరిగించి అందులో ఈ పౌడర్ కలపాలి. ఇళ్లు, కిచెన్ తుడిచేటప్పుడు బకెట్ నీళ్లలో లవంగం నీటిని కలిపి తుడవాలి. ఇంకా మీరు కిచెన్‌లోని మూలల్లో లవంగాలు ఉంచడం ద్వారా కూడా అవి పారిపోతాయి. ఇక్కడ మీరు లవంగాలకు బదులుగా బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు.
బేకింగ్ సోడా : బొద్దింకల నివారణకు బేకింగ్ సోడా చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, పంచదార తీసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బొద్దింకల సమస్య ఉన్న చోట కొద్దిగా చల్లండి. ఇందులోని చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు చనిపోతాయి.
వైట్ వెనిగర్ : బొద్దింకలను తరిమికొట్టడంలో వైట్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్లో సమాన పరిమాణంలో నీరు, వైట్ వెనిగర్‌ని తీసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయాలి.
శుభ్రత ముఖ్యం: అయితే, బొద్దింకలు లేకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంటింట్లో చెత్తచెదారం లేకుండా చూసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలను బయట పడేయాలి. ఇవి కిచెన్‌లో ఉంటే బొద్దింకలు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి, ఇవి పెరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
దుస్తులు ఉతకడానికి, గిన్నెల క్లీనింగ్ కోసం సబ్బులు వాడుతున్నారా? అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోండి!
కిచెన్ క్లీనింగ్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? - ఇలా చేశారంటే ఎప్పుడూ తళతళా మెరుస్తుంది!