Students Explaining Lessons In The Form Of Burrakatha : బుర్రకథ.. ఇప్పటి పిల్లలకు అంతగా పరిచయం లేని పదం. కారణం మారుతున్న జీవనవిధానం, అలాగే వారికి అందుబాటులో ఉన్న మాధ్యమాలు. ఎప్పుడూ ఫోన్లు, టీవీలు చూస్తూ సమయం గడపే వారికి బుర్రకథ అనే పదం కొత్తది అనడంలో అతిశయోక్తి లేదు. మరి బుర్రకథ అంటే ఏంటి? ఇప్పుడు దాని గురించి ఎందుకు చెబుతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటి కాలంలో సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైపోయింది. ఎక్కడ ఏం జరిగినా ఇంట్లోనే కూర్చుని వివిధ రకాలైన ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాల్లో బుర్ర కథలు, హరికథలు, తోలుబొమ్మలాట వంటి వివిధ కార్యక్రమాలు జరిగేవి. సాయంకాలం పూట ఒక వీధి చివర వీటిని నిర్వహించేవారు. అందరూ వచ్చి ఒకచోట పోగై ఆనందంగా వీక్షించే వారు.
'వందేమాతరం.. మనదే రాజ్యం'.. బ్రిటిష్పై పోరాడుతూ వీరుడి ప్రాణత్యాగం!
పాఠాలతో పాటు కళలు తెలుసుకునే అవకాశం : కానీ ఇప్పుడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ వివిధ పరికరాలు అందుబాటులోకి రావడంతో బుర్రకథ, హరికథలు, డ్రామాలు కనుమరుగయ్యాయి. ఎక్కడో ఓ చోట కనిపిస్తున్నాయి. అది కూడా పూర్తిస్థాయిలో కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేటితరం విద్యార్థులకు ఈ కళను పరిచయం చేయాలని గోరంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేసే ప్రభాకర్ విద్యార్థుల చేత పాఠాలను బుర్ర కథ రూపంలో చెప్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు పాఠాలు అర్థమవడమే కాకుండా, ఆనాటి కళల గురించి పిల్లలు తెలుసుకుంటారని ఆయన అంటున్నారు.
సంప్రదాయం తెలుసుకునే మార్గం : ఈ మేరకు గ్రామంలో బుర్ర కథ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముగ్గురు విద్యార్థులు ఏడవ తరగతిలోని 'సీత ఇష్టాలు' అనే పాఠాన్ని బుర్రకథ విధానంలో వినిపించారు. బుర్రకథ చెప్పవాళ్లు ఎలా రెడీ అవుతారో అలానే తయారై, ఆ పాఠాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను, ఉపాధ్యాయుడిని అభినందించారు.