Old Video Clips Of Tiger goes Viral On Social Media : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచరిస్తుందని కొంతమంది పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో గ్రామీణ ప్రజలు సోమవారం భయాందోళనకు గురయ్యారు. పత్తి తీసేందుకు వెళ్లిన మహిళలు భయంతో ఇంటిబాట పట్టారు. కొంతమంది పులి సంచారం నిజమా? అబద్దమా అని ఆయా గ్రామాల వారికి ఫోన్‌లు చేసి తమ సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు.
దీంతో పాటు మండలంలోని యాపల్‌గూడ పంచాయతీ పరిధిలోని రాములగూడలో ఓ మహిళ పులి అడుగు జాడలను చూసినట్లు చెప్పడంతో స్థానికంగా కలకలం రేపింది. సమాచారమందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అడుగులను పరిశీలించారు. ఆ తర్వాత తంతోలి, అంకోలి, కొత్తూరు, చింతగూడ గ్రామాల్లో బెబ్బులి సంచరిస్తుందంటూ కొంతమంది సామాజిక మాధ్యమం వేదికగా వదంతులను సృష్టించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ పొలాల నుంచి ఇంటికి చేరుకున్నారు.
పత్తి చేనులో బెబ్బులి : వాంకిడి మండల కేంద్రానికి సమీపంలోని పత్తి చేనులో పులి కనిపించింది అనే వార్త కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఇటన్‌కర్ తుకారాం అనే వ్యక్తికి పత్తి చేనులో సోమవారం ఉదయం 7గంటల సమయంలో బెబ్బులి కనిపించింది. పాలేరు మారుతి పురుగుమందు పిచికారీ చేస్తుండగా కనిపించడంతో అతడు వెంటనే గ్రామానికి వచ్చి గ్రామస్థులు, అటవీ అధికారులకు ఈ సమాచారం తెలియజేశారు. అనంతరం ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించగా పాదముద్రలు స్పష్టంగా కనిపించక పోవడంతో పులి కాకపోయి ఉండవచ్చని ఫారెస్ట్ ఉపరేంజి అధికారిణి ఝాన్సీలక్ష్మి, బీట్ అధికారి శ్రీనివాస్‌లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా తాను చూసింది పులేనని మారుతి స్పష్టం చేస్తుండటం వల్ల వాంకిడితో పాటు పరిసర గ్రామాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పత్తిని ఏరేందుకు వెళ్లిన వారు ఇంటి బాటపట్టారు. ఆదివారం ఉదయం ఇదే ప్రాంతానికి సమీపంలోని కాలువలో దుప్పి ప్రమాదవశాత్తు పడిపోగా అధికారులు దానిని బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దుప్పిని వేటాడుతూ వచ్చిన బెబ్బులి అది కాలువలో పడిపోవడంతో సమీప చేనులో ఉండవచ్చని స్థానికులతో పాటు ఫారెస్ట్ శాఖ సిబ్బంది భావిస్తున్నారు. పాదముద్రలు చూపిస్తామని స్థానికులు చెప్పినప్పటికీ అధికారులుపట్టించుకోలేదని ఆరోపించారు. కాగా మండల కేంద్రంలో పంచాయతీ అధికారులు పులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు.
పులి పంజాకు ఉలిక్కిపడుతున్న జిల్లా - బెబ్బులి కోసం డ్రోన్ కెమెరాతో గాలింపు!