Floods Damage in Khammam and Mahabubabad : భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. ఖమ్మం-మహబూబాబాద్ జిల్లాల మధ్య జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉద్ధృతికి ములకలపల్లి వంతెన పూర్తిగా కొట్టుకుపోగా రెండు జిల్లాల మధ్య ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. లక్షలాది పెట్టుబడి వరదార్పణమైందని సాగుదారులు వాపోయారు. పొలాలు బాగుచేసుకుని, మరోపంట సాగు చేయాలంటే తమ తరం కాదని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే చేయూతనివ్వాలని బాధిత కర్షకులు కోరుతున్నారు.
వరద మిగిల్చిన విషాదం వల్ల కనీసం పొలాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ నల్లచెరువు ఇటీవల కురిసిన వర్షానికి తెగి గోపాలపురం నుంచి బూరుగడ్డ, కరక్కాయలగూడెం వెళ్లే రహదారి ధ్వంసమైంది. నాలుగు రోజుల నుంచి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లేందుకు వీలు లేక పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు చెరువుల నుంచి దారి చేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. తెగిన రోడ్డుకు మరమ్మతులు చేసి సాధారణ స్థితికి రోడ్డును తేవాలని ప్రజలు కోరుతున్నారు.
'కురిసిన భారీ వర్షాలకు నల్లచెరువు తెగిపోయి రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. దాదాపు నాలుగైదు గ్రామాలు ఈ దారి నుంచి వెళుతారు. కానీ ప్రస్తుతం చెరువు తెగిపోవడంతో వాహనదారులు, స్కూల్ విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. దీంతో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అత్యవసరం ఉంటే చెరువు చుట్టూ నడిచి వెళ్లడం లేదా చెరువులోని తక్కువ ఉన్న నీళ్లలో నుంచి నడవాల్సి వస్తోంది'- స్థానికులు
దాదాపు ముంపునకు గురైన 200 ఇళ్లు : పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు తప్ప ఏం లేకుండా పోయిందని, వాటిని బాగు చేసుకోవాలంటే కనీసం ఎకరానికి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎకరా సాగు కోసం రూ.30 వేలు ఖర్చు చేసినట్లు వివరించారు. అధికారులు త్వరగా నష్టం వివరాలను లెక్కగట్టి పరిహారం అందేలా చూడాలని వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామం వరద తాకిడికి విలవిలలాడింది. దాదాపు 200 ఇళ్లు ముంపునకు గురయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.