World Telugu Writers Mahasabhalu : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేబీఎన్ కళాశాల కేంద్రంగా ఈ నెల 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు 3 వేదికలపై 25కు పైగా సదస్సులు, కవిత్వం, సాహితీ సమ్మేళనాలు జరగబోతున్నాయి. 'రేపటి తరం కోసం - మనం ఏ మార్పు కోరుతున్నాం' అనే అంశంపై సదస్సులు, చర్చాగోష్ఠి, సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి.
రేపటి తరం కోసం : ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కేబీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు దేశవిదేశాల నుంచి భాషాభిమానులు, రచయితలు, కవులు, విద్యార్థులు 1500 మందికి పైగా తరలి వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. మరో వంద మంది ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. 'రేపటి తరం కోసం - మనం ఏ మార్పు కోరుతున్నాం?' అనే అంశంపై సదస్సులు, చర్చాగోష్ఠి, సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు భాషను రేపటి తరానికి మరింత ప్రభావవంతంగా చేరవేయడానికి ఎలాంటి మార్పులు తేవాలనే కార్యాచరణను అందరూ కలిసి రూపొందిస్తారు.
శనివారం కార్యక్రమాలు : ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో మొదటి రోజు పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని రామోజీరావు ప్రధాన వేదికపై ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మహాసభల గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
సాయంత్రం వరకు ప్రధాన వేదికపై తెలుగు వెలుగు, శాస్త్ర సాంకేతిక రంగం, పత్రికలు, ప్రచురణలు, ప్రసార రంగాలు తదితర అంశాలపై సదస్సులు ఉంటాయి. అలాగే మహిళా ప్రతినిధులు, సాంస్కృతికరంగ ప్రతినిధుల సదస్సులు జరుగుతాయి. మరో 2 వేదికలపై కవిత్వం, సాహిత్యం, విద్యా రంగ ప్రతినిధుల సదస్సులు, కవులు, యువ కలాల సమ్మేళనాలు నిర్వహించనున్నారు.
ఆదివారం కార్యక్రమాలు : మహాసభల్లో రెండో రోజు రామోజీరావు ప్రధాన వేదికపై ఉదయం 9 గంటల నుంచి సదస్సులు ప్రారంభం అవుతాయి. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు, సాహితీ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు జరిగే ముగింపు సభలో మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారు. మరో 2 వేదికల పైనా ఉదయం నుంచి వరుసగా కవులు, యువ కలాల సమ్మేళనం, పరిశోధన రంగం, భాషోద్యమం, బాల సాహిత్యంపై సదస్సులు జరగనున్నాయి.
"అమ్మ డైరీలో కొన్ని పేజీలు" - తొలి నవలతో ప్రశంసలు అందుకున్న టెకీ